హిట్ డైరెక్టర్.. ఆస్కార్ టార్గెట్!
కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అట్లీ(Atlee). స్టార్ హీరోల ఇమేజ్ను, మాస్ ఎలిమెంట్స్‌ను, ఎమోషన్స్‌ను కలిపి ఆడియన్స్ ను మెప్పించడంలో ఇప్పటివరకు మంచి సక్సెస్‌నే అందుకున్నాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్‌లు సాధించడం, ప్రపంచ సినీ వేదికపై ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవడం రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు. ఇప్పుడు తన తర్వాతి సినిమా రాకా(raaka)తో ఆస్కార్‌పై కన్నేశానంటూ అట్లీ చేసిన కామెంట్స్ ఈ తేడాపైనే కొత్త డిస్కషన్ కు తెరతీశాయి.
అట్లీ సినిమాల్లో కమర్షియల్ అప్పీల్ ఎప్పుడూ ప్రధాన బలంగా కనిపించింది. భారీ హీరోయిజం, ఎమోషనల్ డ్రామా, యాక్షన్, ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే కథనం ఆయన సినిమాలకు బాక్సాఫీస్ బలాన్ని ఇచ్చాయి. కానీ ఆస్కార్ స్థాయి గుర్తింపు కోసం కేవలం ప్రేక్షకాదరణ సరిపోదనే అభిప్రాయం ఉంది. కథలో కొత్తదనం, స్ట్రాంగ్ నేరేషన్, క్యారెక్టర్ల లోతు, ప్రపంచ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే ఎమోషన్ వంటి అంశాలు కూడా కీలకంగా మారతాయి.
ఇవి కూడా చదవండి
అందుకే రాకా అట్లీ కెరీర్లో మరో రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా, ఆయన డైరెక్టర్ గా ఎంత దూరం వెళ్లగలడో చూపించే పరీక్షగా మారుతోంది. తనకు బాగా తెలిసిన మాస్ ఫార్ములాను కంటిన్యూ చేస్తూనే దానికి ఇంటర్నేషనల్ లెవెల్ ట్రీట్మెంట్ జోడిస్తారా? లేక పూర్తిగా కొత్త కథనంతో తనపై ఉన్న అభిప్రాయాలను మార్చేస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఆస్కార్ టార్గెట్ ను మాటల్లో చెప్పడం కంటే రాకా తెరపై ఆ స్థాయి కంటెంట్‌ను చూపించగలిగితేనే అట్లీ స్టేట్మెంట్కు అసలు బలం వచ్చినట్టవుతుంది.








