ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలతో దుమారం!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారీ విద్యార్థి ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనలకు అదుపుతప్పిన వలసలే కారణమని, ఇస్లాం ..ఫ్రాన్స్ ను తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నమేనని ఆరోపించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే..ట్రంప్ వ్యాఖ్యలను ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
“ఫ్రాన్స్‌లో జరుగుతున్నది అదుపులేని సామూహిక వలసల ఫలితమే తప్ప మరొకటి కాదు. ఇది పాఠశాలల గురించి కాదు, ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్న ఫ్రాన్స్‌ను ఇస్లాం స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనలకు, ట్రంప్ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని మరోవైపు స్పష్టమవుతోంది. విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలు, నిధుల కొరత, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గత సెప్టెంబర్ నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనల డిమాండ్లలో వలసలు లేదా మతపరమైన అంశాలు ఎక్కడా లేవు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఘాటుగా స్పందించారు. “మన కథను మనమే రాసుకోకపోతే, ఇతరులు మన కోసం రాస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ఇతరులు తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి అనుమతించవద్దని హెచ్చరించారు.
ఈ నిరసనల్లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది పాల్గొన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పగా, 4.5 లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 6,100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.








