విదేశీవిద్యార్థుల కలలపై ట్రంప్ బాంబ్… ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు
అమెరికాలో ఉన్నత చదువులు చదివి, అక్కడే స్థిరపడాలని కోరుకునే యువత ఆశలపై.. అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ వేశారు. అమెరికా విద్యా సంస్థల్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఆ దేశంలో పని చేయాలని కోరుకునే ప్రతి అంతర్జాతీయ విద్యార్థిపై 70 వేల డాలర్లు ఫీజుగా చెల్లించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ ఫీజును సంబంధిత విద్యా సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికా విద్యా సంస్థల్లో తాము చదివిన మేజర్ సబ్జెక్టులో అనుభవం గడించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం (ఓపీటీ)లో పాలుపంచుకునే విద్యార్థులకు సంబంధించి ఈ ఫీజు చెల్లించాలన్నది ప్రతిపాదన. అమెరికా నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులు సాధారణంగా ఏడాది పాటు పనిచేసుకునేందుకు అర్హులు. అయితే విజ్ఞాన శాస్త్రం, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం చదివిన విద్యార్థులు అదనంగా మరో రెండేళ్లపాటు ఉపాధి పొందే వీలుంది.
ప్రభుత్వ తాజా ప్రతిపాదన ..ఆదాయం కోసం విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించే అమెరికన్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు కూడా శరాఘాతమే! అంతర్జాతీయ విద్యార్థులను నియమించుకునే టెక్ కంపెనీలు, పరిశ్రమలు ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం ఓపీటీ కింద పని చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే ప్రతి విద్యార్థిపై సంబంధిత విద్యా సంస్థ 70 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పనిచేసుకునే అనుమతిని పొడిగించుకునేందుకు జరిపే ప్రతి రెన్యువల్‌కు 30 వేల డాలర్లు చొప్పున చెల్లించాలని ప్రతిపాదించారు.








