విమానం వచ్చింది.. కానీ ఎక్కేందుకు ప్రయాణికులు లేరు!
మీ ఊరికి కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది.
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీకి విమానాలు మొదలయ్యాయి. ఇక ప్రయాణం సులభమైపోయిందని మీరు అనుకున్నారు. కానీ రెండేళ్ల తర్వాత అదే ఎయిర్‌పోర్ట్‌లో విమానం కనిపించకపోతే? ఇదే ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అసలు సమస్య.
ప్రభుత్వం రూ.29,000 కోట్లతో కొత్త రూట్లు, కొత్త ఎయిర్‌పోర్టులు, కొత్త విమానాలను తీసుకొస్తోంది. రన్‌వే లను ప్రభుత్వం నిర్మిస్తోంది. కానీ విమానంలో సీట్లను మాత్రం ప్రభుత్వం నింపలేదు కదా.
సెప్టెంబర్ 2026 నాటికే లెక్కలేస్తే 687 రూట్లు, 95 ఏరోడ్రోమ్స్, కోటి డెబ్బై లక్షలకు పైగా ప్రయాణికులు అని ఘనమైన గణాంకాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక అసలైన ప్రశ్న ఎదురవుతోంది , రన్వేలు సరే, విమానాలు సరే… అసలు నిలకడగా ప్రయాణించే ప్రయాణికులు ఎక్కడ?
సబ్సిడీ ఉన్నంత వరకేనా ఈ హడావుడి?
ఒక విమాన మార్గాన్ని కాగితాల మీద ప్రారంభించడం చాలా సులభం, కానీ దాన్ని ఐదేళ్లు, పదేళ్ల పాటు ఆపకుండా నడపడమే అసలైన సర్కస్. గత ఉడాన్ అనుభవాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF) అంటే సబ్సిడీ డబ్బులు ఉన్నంతసేపూ ఎయిర్‌లైన్స్ బాగానే నడిపాయి. కానీ సబ్సిడీ ఆగిపోగానే సగానికి పైగా రూట్లలో విమానాలు ఆగిపోయాయి.
కారణం ఒక్కటే .. సబ్సిడీ లేకపోతే టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి, అంత పెట్టి ప్రయాణించడానికి చిన్న నగరాల్లో ప్రయాణికులు సిద్ధంగా లేరు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం రూట్లను మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచడం, ఆగిపోయిన ఎయిర్‌పోర్టులను మళ్లీ “రీబూట్” చేయడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎంత కొత్త మోడల్స్ తెచ్చినా, ఎయిర్పోర్ట్ కట్టడం అనేది విజయానికి ఆరంభం మాత్రమే తప్ప ముగింపు కాదని అర్థమవుతోంది.
శంఖ్ ఎయిర్ ఎదుర్కొంటున్న అసలు సవాళ్లు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘శంఖ్ ఎయిర్’ (Shankh Air) అనే కొత్త ఎయిర్‌లైన్ కథ తీసుకుంటే ఈ సమస్య లోతు ఇంకా బాగా అర్థమవుతుంది. వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ (NOC) వచ్చింది, గ్రౌండ్ ఆపరేషన్స్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయినా సరే విమానం గాల్లోకి ఎగరలేకపోతోంది. కమర్షియల్ ఆపరేషన్స్ మొదలుపెడదామనుకున్న లక్ష్యాలను వాయిదా వేసుకుంటూ పోతున్నారు.
వెస్ట్ ఏషియాలోని అలజడుల వల్ల అంతర్జాతీయంగా విమానాల లీజింగ్ మార్కెట్ దెబ్బతినడం, తుది అనుమతులు ఆలస్యం కావడం వల్ల వాళ్ల ప్లాన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఉండి, ప్లాన్స్ సిద్ధంగా ఉన్నా… ఒక కొత్త ఎయిర్‌లైన్‌ను మార్కెట్లోకి తీసుకురావడంలో ఉన్న అడ్డంకులు ఇన్ని అన్ని కావు.
బిగ్ ప్లేయర్స్ మధ్య చిన్న ఎయిర్‌లైన్స్ నిలబడగలవా?
మనదేశ విమానయాన రంగాన్ని చూస్తే IndiGo, Air India రెండే దాదాపు 90 శాతం మార్కెట్‌ను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇలాంటి భారీ తిమింగలాలున్న నీళ్లలో కొత్త ఎయిర్‌లైన్స్ ఈత కొట్టడం అస్సాం పనుల్లో ఒకటి. చిన్న నగరాల నుంచి రోజూ ఒక విమానం నడపడం తేలికే కావచ్చు, కానీ విమానంలో సగం సీట్లు ఖాళీగా ఉంటే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు?
ఇంధనం, లీజు, విమానాశ్రయ ఛార్జీలు, సిబ్బంది జీతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రశ్నించాల్సింది “అక్కడ ఎయిర్పోర్ట్ ఉందా?” అని కాదు, “ఆ ఎయిర్పోర్ట్ నుంచి రోజుకూ ఎంతమంది నిజంగా విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు?” అని మాత్రమే.
ఇవి కూడా చదవండి
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల మంట
ప్రస్తుతం అక్టోబర్ 2026 నాటికి విమానయాన రంగానికి ఇంధన ధరలే పెద్ద శాపంగా మారాయి. వెస్ట్ ఏషియా సంక్షోభం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎయిర్‌లైన్ కంపెనీల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో కేవలం ఇంధనానికే 55 నుండి 60 శాతం వరకు తగలేయాల్సి వస్తోంది.
దీంతో IndiGo లాంటి పెద్ద కంపెనీలే ఫ్యూయల్ సర్ఛార్జ్ పెంచేసాయి. పెద్ద ఎయిర్‌లైన్స్ అంటే ఏదో ఒక బిజీ రూట్లో వచ్చే లాభాలతో నష్టాలను భర్తీ చేసుకుంటాయి. కానీ రెండు మూడు రూట్లే నమ్ముకున్న చిన్న ప్రాంతీయ ఎయిర్‌లైన్స్ పరిస్థితి ఏంటి? ఇంధన ధరల భారం పడితే క్యాష్‌ఫ్లో దెబ్బతిని అతి తక్కువ సమయంలోనే బోర్డు తిప్పేసే ప్రమాదం ఉంది.
అభివృద్ధికి బాటలు… లేదంటే ఖరీదైన వ్యర్థాలు?
ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి ఛాలెంజ్ మోడ్‌లో రాష్ట్రాలతో కలిసి రన్వేలు, ఎయిర్‌పోర్టులు నిర్మించడం మంచిదే. ఎందుకంటే విమానం ల్యాండ్ అయితే ఆ ప్రాంతంలో పర్యాటకం పెరుగుతుంది, వ్యాపారాలు విస్తరిస్తాయి, రియల్ ఎస్టేట్ మరియు ఆసుపత్రులు బాగుపడతాయి.
కానీ రెండేళ్ల పాటు హడావుడి చేసి, ఆ తర్వాత ప్రయాణికులు లేక విమానాలు రావడం ఆగిపోతే ఏమవుతుంది? అంత ప్రజాధనంతో కట్టిన కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాలు ఏ పనికీ రాకుండా పడి ఉండే వ్యర్థాలుగా మిగిలిపోతాయి.
మారాల్సిన కొత్త కొలమానాలు
ఇప్పటివరకు మనం ఎన్ని ఎయిర్‌పోర్టులు కట్టాం, ఎన్ని రూట్లు తెరిచాం, ఎంతమంది ప్రయాణించారు అనే లెక్కలతోనే విజయాన్ని కొలిచాం. కానీ ఇకపై సరికొత్త ఆలోచన అవసరం. సబ్సిడీలు పూర్తిగా ఆగిపోయాక కూడా ఆ రూట్లో విమానాలు తిరుగుతున్నాయా? ప్రయాణికులతో విమానాలు పూర్తిస్థాయిలో నిండుతున్నాయా? కంపెనీలకు ఆ రూట్లలో ఏమైనా లాభాలు మిగులుతున్నాయా?
ఐదేళ్ల తర్వాత కూడా ఆ విమానం ఆ నగరానికి వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. ఎందుకంటే రన్‌వే కట్టడం ప్రభుత్వ పని కావొచ్చు, కానీ దానిపై విమానం నిలకడగా ఎగరాలా లేదా అనేది మాత్రం కఠినమైన మార్కెట్ పరిస్థితులే నిర్ణయిస్తాయి.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








