రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న ఆర్టీసీ ఎన్నికలు..!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRC) లో గుర్తింపు సంఘం ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం కార్మిక సంఘాల హక్కుల సాధన కోసమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుమారు 39వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఈ ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు పదేళ్ల విరామం తర్వాత కార్మికులు రహస్య బ్యాలెట్ ద్వారా తమ నాయకులను ఎన్నుకోనుండటంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
ఈసారి ఎన్నికల్లో కార్మిక సంఘాలు విభిన్న కూటములుగా ఏర్పడి బరిలో నిలిచాయి. ప్రధానంగా మూడు కూటములు ఏర్పడి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కూడిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (SWU) ఒక కూటమిగా ఏర్పడ్డాయి. టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ యూనియన్ (TMU), నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) సంయుక్తంగా జేఏసీ (JAC)గా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. అలాగే తెలంగాణ జాయింట్ మజ్దూర్ యూనియన్ (TJMU), బహుజన్ వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు మరో కూటమిగా బరిలోకి దిగాయి.
ఈ సంఘాల వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రధాన రాజకీయ పార్టీల హస్తం ఉండటంతో ఈ ఎన్నికలు కార్మిక క్షేత్రాన్ని తలపించడం లేదు.. అసలుసిసలు రాజకీయ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అధికార పార్టీ మద్దతు ఉన్న యూనియన్లు ఒకవైపు, ప్రతిపక్షాల బలంతో మరికొన్ని యూనియన్లు కార్మికులను ఆకట్టుకునేందుకు విభిన్న వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచార పర్వం ఊపందుకోవడంతో కార్మిక సంఘాలు మేనిఫెస్టోలను, భారీ డిమాండ్ల పత్రాన్ని విడుదల చేశాయి. ప్రధానంగా 40 డిమాండ్లతో కూడిన చార్టర్ను జేఏసీ విడుదల చేయగా, అన్ని కూటములు కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, వేతన సవరణ అమలు, ఏప్రిల్ 1, 2025 నుంచి రావాల్సిన వేతన సవరణ బకాయిలు, పెండింగ్లో ఉన్న 2017, 2021 బకాయిల చెల్లింపు వంటి కీలక అంశాలను తెరపైకి తెచ్చాయి. అలాగే తార్నాక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ప్రావిడెంట్ ఫండ్ బకాయిల క్రమబద్ధీకరణ, కొత్త బస్సుల కొనుగోలు, డిపోల అభివృద్ధి వంటి హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటూ నాయకులు డిపోల వారీగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఎన్నికల ఫలితాలు కేవలం యూనియన్ గుర్తింపుకే పరిమితం కాకుండా, కార్మిక వర్గంలో ఏ పార్టీకి పట్టుందనే దానికి నిదర్శనంగా మారుతాయి. ప్రభుత్వ విధానాలపై కార్మికుల్లో ఉన్న అభిప్రాయాన్ని ఈ బ్యాలెట్ బాక్సులు ప్రతిబింబించే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం కోసం గతంలో జరిగిన సమ్మెలు, ఆందోళనలు, ప్రభుత్వంతో జరిగిన చర్చలు అన్నీ నేడు ఓటర్ల మదిలో మెదులుతున్నాయి. ఒకవైపు కార్మికుల హక్కుల పరిరక్షణ, మరోవైపు రాజకీయ ఆధిపత్య పోరు మధ్య నడుస్తున్న ఈ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో నూతన సమీకరణాలకు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో కార్మికులు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఏ కూటమి విజయఢంకా మోగిస్తుంది అనేది వేచి చూడాలి!








