మాలిక్యూల్స్ మిర్రర్ ఇమేజ్ కనిపెట్టేశారు.. ఇద్దరు సైంటిస్టులకు నోబెల్ అవార్డ్..
మాలిక్యూల్స్ మిర్రర్ ఇమేజెస్ చిక్కుముడి విప్పిన శాస్త్రవేత్తలు హెన్రీ బి కేగన్, కెన్సో సోయీలను ప్రతిష్ఠాత్మక నోబెల్ వరించింది. రసాయన శాస్త్రంలో వీరిద్దరినీ ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్‌హోంలో కటించింది. అణువుల హోమోకైరాలిటీ దానంతటదే స్వాభావికంగా ఎలా ఆవిర్భవిస్తుందన్నది శాస్త్రవేత్తలను శతాబ్ద కాలానికి పైగా వేధించిన ప్రశ్న. దానికి సమాధానాన్ని కేగన్, సోయీ తమ విశేష కృషితో కనుగొన్నారని నోబెల్ కమిటీ (కెమిస్ట్రీ) ఛైర్మన్ హీనర్ లింకె పేర్కొన్నారు.
వారు అభివృద్ధి చేసిన రసాయనిక చర్యలు అద్భుతమైనవంటూ ప్రశంసించారు హీనర్. ఈ శాస్త్రవేత్తల ద్వయం కృషి ఆధునిక ఔషధ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. లెక్కలేనన్ని ఔషధాల అభివృద్ధికి బాటలు పరిచింది. 95 ఏళ్ల కేగన్ ఫ్రాన్స్‌లో జన్మించారు. ఓర్సేలోని పారిస్-సుడ్ యూనివర్సిటీతో అనుబంధం కలిగి ఉన్నారు. జపాన్‌లో జన్మించిన సోయీ (76) టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌కు అనుబంధంగా పనిచేస్తున్నారు. నోబెల్ పురస్కారంతో దక్కే దాదాపు రూ.11.5 కోట్ల నగదు బహుమతిని వీరిద్దరూ పంచుకోనున్నారు.
మాలిక్యూల్స్ చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ నిజానికి అవి ఒక్కటి కావు.. మన కుడి, ఎడమ చేతుల్లా వేర్వేరు వెర్షన్లు. రెండు చేతులూ ఒకలా ఉండవు. కానీ అవి ఒకదానికొకటి దర్బణ ప్రతిబింబాలు. కర్బన రసాయన శాస్త్రంలో ఈ గుణాన్ని ‘కైరాలిటీ’ అని పిలుస్తారు. ప్రొటీన్ల నిర్మాణాత్మక అణువులైన అమైనో ఆమ్లాలు పరస్పర ప్రతిబింబాలుగా ఉండే రెండు రూపాల్లో ఉంటాయి. అయితే భూమిపై జీవులన్నీ ఈ రెండింటిలోని ఒకే ఒక రూపంతో పనిచేస్తాయి. దర్పణ ప్రతిబింబాన్ని కాకుండా.. అవసరమైన సరైన రూపాన్ని మాత్రమే ప్రకృతి ఎలా తయారుచేసుకుంటోందనే ప్రశ్నకు కేగన్, సోయీ సమాధానం కనుగొన్నారు. అంటే.. జీవుల్లో సౌష్ఠవరాహిత్యం వెనుక రసాయనిక గుట్టును వారు ఛేదించారన్నమాట.
తొలుత రసాయనిక చర్యలను నియంత్రించే విధానాన్ని కేగన్ 1980ల్లో కనుగొన్నారు. కావాల్సిన రకం అణువులను.. అప్పటివరకూ సాధ్యమవుతుందని ఊహించినదాని కంటే ఎక్కువగా ఆయన ఉత్పత్తి చేయగలిగారు. ఆపై సోయీ మరో అడుగు ముందుకేశారు. అవసరమైన రకం అణువులను మాత్రమే (హోమోకైరాలిటీ) ఉత్పత్తి చేసే రసాయనిక చర్యను అభివృద్ధి చేశారు. ప్రయోగశాలల్లో హోమోకైరాలిటీని తొలిసారి సుసాధ్యం చేసిన ఘనత సోయీదే. కెమిస్ట్రీ చరిత్రలో అత్యంత అద్భుత ప్రయోగాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తుంటారు.
సాధారణంగా ప్రయోగశాలల్లో నిర్వహించే రసాయనిక చర్యల్లో కుడి, ఎడమ అణువులు రెండూ దాదాపు 50-50 నిష్పత్తిలో తయారవుతుంటాయి. వాటితో ఔషధాలు తయారుచేయడం ఒక్కోసారి ప్రమాదకరంగా మారొచ్చు. ఎందుకంటే- ఒక రకం అణువులు వ్యాధిని నయం చేసే గుణాన్ని కలిగి ఉంటే.. మరో రకం అణువులు హానికారకం కావొచ్చు. ఉదయాన్నే వికారం (మార్నింగ్ సిక్నెస్)తో బాధపడే గర్భిణీలకు 1950ల్లో థలిడోమైడ్ అనే ఔషధాన్ని వైద్యులు సిఫార్సు చేసేవారు. అయితే అదొక కైరల్ అణువు. కుడి చేతి వెర్షన్ మంచి ఔషధంగా పని చేస్తుంది. ఎడమ చేతి రూపం తీవ్ర విషపూరితమైనది. అప్పట్లో ఉత్పత్తి చేసిన థలిడోమైడ్ తీసుకున్న గర్భిణులకు పుట్టిన పిల్లల్లో తీవ్ర వైకల్యాలు తలెత్తాయి. అలాంటి దుష్పరిణామాలు ఎదురుకాకుండా నివారించడంలో కేగన్, సోయీల కృషి బాగా ఉపయోగపడింది. ఎంపిక చేసిన అణువులను తయారుచేసుకొని.. వాటితో ఔషధాలు, పర్ఫ్యూమ్లు, ఇతర పదార్థాలను శాస్త్రవేత్తలు నేడు తయారుచేయగలుగుతున్నారు.








