హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ .. భారత్‌లో తొలి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఇదే
అమెరికా (America)కు చెందిన ప్రభుత్వ యూనివర్సిటీ కొలరాడో డెన్వర్ (University of Colorado Denver ) (సీయూ డెన్వర్) తన విదేశీ ప్రాంగణాన్ని హైదరాబాద్ (Hyderabad) నగరంలో త్వరలో ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం భారత్ (India) లోనే క్యాంపస్ ఏర్పాటు కోసం అనుమతి పొందిన తొలి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదే కావడం విశేషం. భాగ్యనగరంలో సీయూ క్యాంపస్‌ను నెలకొల్పేందుకు ఆ వర్సిటీ తాజాగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) పొందింది. 2027 ఆగస్టు నుంచి క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విద్యా నాణ్యత, ఫలితాలు, ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణమైన స్కిల్స్‌పై ఈ వర్సిటీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. బిజినెస్, అనలిటిక్స్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో కోర్సులను సీయూ డెన్వర్ అందించనుంది. వర్సిటీ ఛాన్సలర్ కెన్నెత్ క్రిస్టెన్సెన్ (Kenneth Christensen) మాట్లాడుతూ భారతీయ విద్యార్థులతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ క్యాంపస్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. వివిధ రంగాల్లో తమకున్న ప్రత్యేక అనుభవాన్ని భారత్‌లోని విద్యార్థులకు అందించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.








