ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవిత చరిత్రకు అరుదైన ఘనత… గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థ (BAPS Swaminarayan Sanstha) ఆధ్మాత్మిక దిగ్గజం అయిన బ్రహ్మస్వరూప్ ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవిత చరిత్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అధికారికంగా చోటు సంపాదించుకుంది. ఒకే రచయిత రాసిన ప్రపంచంలోని అత్యంత పొడవైన జీవిత చరిత్రగా (Longest Biography by a Single Author) ఇది గిన్నిస్ రికార్డును కైవసం చేసుకుంది.
13 సంపుటాలు, 8,848 పేజీల గ్రంథం
సంస్కృత విద్వాంసులు సాధు ఆదర్శజీవన్దాస్ (Sadhu Adarshjivandas) రచించిన “బ్రహ్మస్వరూప్ ప్రముఖ్ స్వామి మహారాజ్: విస్తృత్ జీవన్ అనే కార్య”(Brahmaswarup Pramukh Swami Maharaj: Vistrut Jivan ane Karya) అనే ఈ గ్రంథం ఏకంగా 13 సంపుటాలతో రూపొందింది. మొత్తం 8,848 పేజీలు , 21,46,447 పదాలతో కూడిన ఈ బృహత్తర గ్రంథం ప్రముఖ్ స్వామి మహారాజ్ (1921–2016) అసాధారణమైన 94 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని కళ్లకు కడుతుంది. ఆయన ఆధ్యాత్మిక నాయకత్వం, అపారమైన వినయం, నిస్వార్థ సేవ, భక్తి అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రేరేపించిన సేవా కార్యక్రమాలను ఈ గ్రంథం ద్వారా వివరించారు. జులై 2017 నుండి ఆగస్టు 2020 వరకు సుమారు 38 నెలల పాటు తీవ్రమైన శ్రమకోర్చి ఈ పరిశోధన, రచనను పూర్తి చేశారు.
లండన్ వేదికగా సర్టిఫికెట్ ప్రదానం
అక్టోబర్ 4, 2026 న లండన్‌లోని ఓవో అరెనా వెంబ్లీలో (OVO Arena Wembley) జరిగిన మహంత్ స్వామి మహారాజ్ 93వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. అరెనాలో ఉన్న 11 వేల మంది ప్రజలు , ప్రపంచవ్యాప్తంగా లైవ్ వెబ్‌కాస్ట్ వీక్షించిన వేలాది మంది సమక్షంలో ఈ చారిత్రక వేడుక కన్నులపండువగా జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సీనియర్ అడ్జుడికేటర్ కార్ల్ సావిల్లె (Carl Saville) ఈ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఒక వ్యక్తి జీవితకాలపు అసాధారణ కృషిని డాక్యుమెంట్ చేయడం అరుదైన గౌరవమని ఆయన కొనియాడారు.
భవిష్యత్ తరాల కోసం…
ఈ గ్రంథం కేవలం సాహిత్య రికార్డే కాకుండా, ఆధ్యాత్మికత , తోటివారి సంక్షేమం కోసం అంకితమైన ఒక గొప్ప జీవిత చరిత్రకు సంబంధించిన చారిత్రక ఆర్కైవ్‌గా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు ఈ పుస్తకానికి సంబంధించి 3,10,500కి పైగా కాపీలు అమ్ముడవడం విశేషం. కాగా, బీఏపీఎస్ సంస్థ గతంలో ఫిబ్రవరి 2026లో కూడా గుజరాత్ లోని వడోదరలో 12,723 మంది పిల్లలతో ఏకకాలంలో సంస్కృత శ్లోకాలను పఠింపజేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే.








