22ఏ పై రెండో విడత ఉద్యమానికి సిద్ధమైన బీజేపీ!
తెలంగాణలో 22ఏ భూముల వివాదం మరోసారి దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నిషిద్ధ జాబితా అడ్డంపెట్టుకుని సాగుతున్న అక్రమాలను వెలికితీసేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే మొదటి విడత పోరాటంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన కమలదళం, ఇప్పుడు మరింత దూకుడుగా రెండో విడత ఉద్యమానికి తెరతీస్తోంది. కేవలం పరిపాలనాపరమైన మెమోలు జారీ చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, దీని వెనుక పెద్దఎత్తున రాజకీయ, అధికారిక కుమ్మక్కు ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.
తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ సెక్షన్ 22ఏ నిబంధనల దుర్వినియోగం పెరిగిపోయిందని బీజేపీ వాదిస్తోంది. అసెంబ్లీ వేదికగా రెవెన్యూ మంత్రి స్వయంగా వేల ఎకరాల అక్రమాలు జరిగినట్లు అంగీకరించినప్పటికీ, పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలను, దోషుల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడంలో విఫలమైందని విమర్శిస్తోంది. కూకట్పల్లి సర్వే నంబర్ 1007లో వెలుగుచూసిన వేల కోట్ల విలువైన భూ వివాదమే ఇందుకు ప్రధాన ఉదాహరణ అని బీజేపీ ఎత్తి చూపిస్తోంది. కేవలం ఒక నియోజకవర్గంలోనే వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఈ కుంభకోణం ఎంత పెద్దదై ఉంటుందో అంచనా వేయవచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు
ఈ భూకుంభకోణాల అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని బీజేపీ ఎండగడుతోంది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్న ఈ రెండు పార్టీలు, క్షేత్రస్థాయిలో మాత్రం పేదల భూములను కాపాడటంలో విఫలమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఒక శాతం అక్రమాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయని, మిగతా 99 శాతం కుంభకోణం తెరవెనుక పెద్దల హస్తంతోనే నడుస్తోందని బీజేపీ ఆరోపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు అండగా నిలవడం ద్వారా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే లక్ష్యంగా బీజేపీ ఈ అంశాన్ని తన ప్రధాన రాజకీయ అస్త్రంగా మలచుకుంటోంది.
సెక్షన్ 22ఏ అక్రమాలపై అక్టోబర్ 10 తర్వాత బీజేపీ మరింత ఉధృతంగా రెండో విడత ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సుమారు 200 పైచిలుకు కేసు స్టడీలలోని కీలక వివరాలను ప్రజల ముందుంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన పత్రాలను విడుదల చేసి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. బాధితులకు అండగా నిలవడం, బెదిరింపులకు గురిచేస్తున్న శక్తులపై పోరాటం చేయడం ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. భూ వివాదాలు, రిజిస్ట్రేషన్ల అంశం తెలంగాణలో ఎప్పుడూ సున్నితమైనదే. మధ్యతరగతి ప్రజలు, పేదలు తమ భూముల హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తరుణంలో, బీజేపీ ఈ అంశాన్ని తన రాజకీయ లబ్ది కోసం గట్టిగా నమ్ముకుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేందుకు సెక్షన్ 22ఏ పోరాటం ఒక వేదికగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్రబిందువు కానుందో వేచి చూడాలి.








