ఏపీ కేబినెట్ భేటీకి నలుగురు మంత్రులు దూరం..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం కాగా.. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో రాష్ట్ర పునర్నిర్మాణం, కొత్త పరిశ్రమల స్థాపన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి, మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ అత్యంత కీలకమైన కేబినెట్ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గంలోని నలుగురు ప్రముఖ మంత్రులు గైర్హాజరు కావడం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారు వ్యక్తిగత కారణాల వల్ల కాకుండా, ముందే ఖరారైన అధికారిక మరియు పార్టీ కార్యక్రమాల వల్లే ఈ భేటీకి హాజరుకాలేకపోయారని సమాచారం అందుతోంది. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సీఐఐ (CII) ప్రాంతీయ సదస్సుకు హాజరుకావాల్సి ఉన్నందున పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేకపోయారు.
మరోవైపు విజయవాడలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ అంతర్గత కీలక సమావేశంలో పాల్గొనడం వల్ల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి రాలేకపోగా.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం స్పెయిన్ దేశంలో ఉన్నందున ఈ కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. ఈ నలుగురు మంత్రులు మినహా మిగిలిన మంత్రులందరూ కేబినేట్ సమావేశానికి హాజరు అయ్యారు. గత కొన్ని రోజులుగా కేబినేట్ సమావేశాలకు దూరంగా ఉన్న డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. వరుసగా రెండవ సారి కేబినేట్ సమావేశానికి హాజరు అయ్యారు.








