బీసీలకు 34% కోటాపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, వాటి చుట్టూ ముడిపడి ఉన్న న్యాయపరమైన ప్రక్రియలపై కేబినెట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (BC) 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తాము తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇటీవల ఏపీ హైకోర్టు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పరిమితిపై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక లీవ్ పిటిషన్ (SLP) పై ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు ధర్నాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో, దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన బలమైన న్యాయవాదనలు, సమర్పించాల్సిన నివేదికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, లీగల్ టీమ్‌తో విస్తృతంగా చర్చించారు. 2026 నాటి గణాంకాల ప్రకారం బీసీలకు 34 శాతం కోటా ఇవ్వడం చట్టబద్ధంగా ఎలా సమర్థనీయమో కోర్టుకు వివరించేలా పక్కా వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసింది.
మరోవైపు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవకుడిగా అంటే ముందుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆపై భారత ప్రధానమంత్రిగా విజయవంతంగా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ కేబినెట్ ప్రత్యేక తీర్మానం చేసింది. ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని శ్లాఘిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు అభినందనలు తెలియజేశారు.








