లాస్ఎంజెల్స్లో ఘనంగా జరిగిన హిందీ దివస్ 2026 వేడుకలు
అమెరికాలోని లాస్ఎంజెల్స్లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంలో ‘హిందీ దివస్ 2026’ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కాన్సులేట్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, హిందీ ఉపాధ్యాయులు , భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తరతరాలుగా సమాజాలను, సంస్కృతులను అనుసంధానించే హిందీ భాష ప్రాముఖ్యతను ఈ వేడుకలు ఘనంగా చాటాయి. అమెరికాలో హిందీ భాషాభివృద్ధికి, దాని అభ్యాసనకు కృషి చేస్తున్న యువ విద్యార్థులు, విద్యావేత్తలను ఈ వేదికపై ఏకం చేశారు.
కాన్సుల్ జనరల్ ప్రసంగం ..
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస సభికులనుద్దేశించి ప్రసంగించారు. భారతీయ ప్రవాస కుటుంబాలకు చెందిన యువతరాలు హిందీతో పాటు భారతదేశపు సుసంపన్నమైన భాషా, సాంస్కృతిక వారసత్వంతో అనుబంధాన్ని ఎప్పుడూ కొనసాగించాలని ఆయన నొక్కిచెప్పారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హిందీ భాష ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలు, అనుభవాలు, దృక్పథాలను వివరిస్తూ కవితలు పఠించారు. అలాగే తమ హిందీ మాట్లాడే నైపుణ్యాలను ప్రదర్శిస్తూ భాషపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. విద్యార్థులందరికీ కాన్సుల్ జనరల్ ప్రశంసా పత్రాలను అందజేశారు. వారిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు ప్రత్యేక అవార్డులను బహుకరించారు.
ఉపాధ్యాయులు , కమ్యూనిటీ నేతల సత్కారం..
అమెరికాలో యువతరానికి హిందీ భాషను నేర్పిస్తూ, దానిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్న ఉపాధ్యాయుల సేవలను కాన్సులేట్ ప్రత్యేకంగా అభినందించింది. హిందీ భాషా వ్యాప్తికి వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస ఉపాధ్యాయులను శాలువాలు కప్పి, సర్టిఫికెట్లతో సత్కరించారు. కాన్సులేట్తో కలిసి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన ప్రముఖ కమ్యూనిటీ నేత సునీల్ అగర్వాల్.. తరతరాల మధ్య వారధిగా భాష ప్రాముఖ్యతను వివరించారు. హెచ్ఎస్ఎస్, డీసీఎఫ్, లోటస్ ఫెస్టివల్, ఫ్రెండ్స్ ఆఫ్ ఎంపీ వంటి పలు సంస్థలతో అనుబంధం ఉన్న ఆయన, ప్రస్తుతం లాస్ఎంజెల్స్ ఇండియన్ అసోసియేషన్ (IALA) అధ్యక్షుడిగా , ఛైర్మన్గా సేవలందిస్తున్నారు.
భారతీయ ప్రవాస పౌరులతో నిరంతరం మమేకమవుతూ, అమెరికాలోని యువతరం భారతీయ భాషలు , సాంస్కృతిక సంప్రదాయాలను అభ్యసించేలా, గౌరవించేలా కాన్సులేట్ తరఫున చేస్తున్న నిరంతర కృషికి ఈ హిందీ దివస్ వేడుకలు అద్దం పట్టాయి.









