ఎథిక్స్ కమిటీకి రిప్లై ఇచ్చిన కౌశిక్ రెడ్డి..!
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి అంశం ప్రస్తుతం ఎథిక్స్ కమిటీ ముందు ఉన్న సంగతి తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఎథిక్స్ కమిటీకి.. ఇవాళ ఆయన రిప్లై ఇచ్చారు. మొత్తం 12 పేజీలు, 16 పేరాల్లో ఆయన తన సమాధానాన్ని ఎథిక్స్ కమిటీకి రాతపూర్వకంగా అందించారు. ఆ రోజు సభలో జరిగిన మాటల యుద్ధాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగుస్తోంది. ఇంతలో ఆయన సమాధానం ఇవ్వడంతో దీనిపై 13న ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్చించనుంది.
ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డికి ఇచ్చిన రిప్లైలో అనేక అంశాలను పొందుపరిచారు. ఆరోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తుండటంతో, “నువ్వు ఏ పార్టీలో గెలిచావు?” అని తాను నిలదీశానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కడియం శ్రీహరి ముందుగా తనను దూషించడం వల్లే, ఆ మాటలకు తాను ప్రతిస్పందించాల్సి వచ్చిందని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి కేవలం తన ఒక్కడి వీడియో ఫుటేజ్‌ను మాత్రమే కమిటీకి ఇచ్చారని, ఇది ఏకపక్షమని ఆయన ఆరోపించారు. సభలో కడియం శ్రీహరి మాట్లాడిన, దూషించిన వీడియో ఫుటేజ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని, పూర్తి స్థాయి అసెంబ్లీ వీడియో ఫుటేజ్‌ను అందించాలని కోరారు.
అంతేకాక ఎథిక్స్ కమిటీ ముందుకు తనను, తన అడ్వకేట్‌ను నేరుగా పిలిచి వాదనలు వినాలంటూ కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు. అసెంబ్లీలో జరిగిన సంభాషణను యథాతథంగా తెలుగులో రాసి కమిటీకి పంపారు. తనపై వస్తున్న బెదిరింపు ఆరోపణలను కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన ప్రవర్తన ఎక్కడా అనైతికం కాదని, కేవలం పార్టీ తరఫున, తనపై జరిగిన దాడికి ప్రతిస్పందనగానే వ్యవహరించానని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక, ఎథిక్స్ కమిటీలో సభ్యులుగా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వెడ్మ బుజ్జులపై కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు ఈ విచారణ నుండి తప్పుకోవాలని డిమాండ్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కౌశిక్ రెడ్డి వివాదం తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చింది. ఫిరాయింపుల రాజకీయాలు, పార్టీ మారిన నేతల అనైతికతపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ఈ ఘటన అద్దం పడుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, శాసనసభ వేదికగా సభ్యుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన 12 పేజీల సమాధానంపై చర్చించేందుకు ఈ నెల 13న ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో కౌశిక్ రెడ్డి వివరణను పరిశీలించి, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలా లేక కేసును కొట్టివేయాలా అనేదానిపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.








