సీఎం ఫ్యామిలీ టార్గెట్‌గా బీఆర్ఎస్ ఆరోపణలు… రాజకీయ రగడ!
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధానికి దారితీశాయి. ముఖ్యమంత్రి కుమార్తె నైమిషా రెడ్డి వ్యాపారాలు, ఆస్తులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరు పార్టీల మధ్య పరిస్థితిని మరింత అగ్గి రాజేశాయి.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పెట్టుబడులు, ఫార్మా కంపెనీలు, ఆస్తులపై బీఆర్ఎస్ తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్స్, కార్ల షోరూంలు, కార్పొరేటే స్కూల్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం, పోస్టర్లు, బ్యానర్లు వేయడం పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం.. సీఎం కుటుంబ సభ్యుల వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చి ఆరోపణలు గుప్పించడం అధికార వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించింది. సీఎం కుటుంబానికి ఎలాంటి సంబంధం లేని వ్యాపారాలను ఆపాదించడం ద్వారా బీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని తెలిపింది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఈ వివాదం రాజకీయ వేదికల నుంచి పోలీస్ స్టేషన్లు, హైకోర్టు వరకు చేరింది. సీఎం కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, క్రిశాంక్ అరెస్ట్ పరిణామాలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. సికింద్రాబాద్ కోర్టు ఆయన రిమాండ్‌ను తిరస్కరించడం, ఆ తర్వాత ఆయన తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కావడం, హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ముందుగా ప్రాథమిక విచారణ జరపాలని న్యాయస్థానం స్పష్టం చేయడం పోలీసుల తీరుపై చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
ఈ మొత్తం ఉదంతంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో విఫలమయ్యామనే విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. అయితే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా తిప్పికొడుతోంది. రాజకీయంగా ఎదుర్కొలేకనే ప్రతిపక్షం నీచ రాజకీయాలకు దిగుతోందని, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని మండిపడుతోంది.
రేవంత్ రెడ్డి కుమార్తె ఆస్తులు, వ్యాపారాల అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తున్నప్పటికీ, ఇది ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఒకవైపు ఆధారాలు చూపాలని అధికార పక్షం సవాలు విసురుతుండగా, మరోవైపు చట్టపరమైన చిక్కులు, న్యాయస్థానాల జోక్యం నేపథ్యంలో ఈ వివాదం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.








