అమెరికాలో చదువుతున్న భారతీయులకు భారీ షాక్..!!
అమెరికాలో చదువుకోవటానికి సీటు వచ్చిందని తెలియగానే ప్రతీ ఇంట్లోనూ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఎక్కడెక్కడో దాచుకున్న పొదుపు మొత్తాలు, ఎడ్యుకేషన్ లోన్లు, అవసరమైతే ఉన్న కాస్త ఆస్తిని అమ్మేసి అయినా సరే బిడ్డను విదేశాలకు పంపుతారు తల్లిదండ్రులు. ఎలాగైనా చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకుని, కుటుంబ కష్టాలను గట్టెక్కిస్తాడనేది వారి ఆశ.
అందుకు తగ్గట్లుగా కొడుకో, కూతురో అమెరికా వెళ్తారు. రెండేళ్లపాటు రాత్రనకా పగలనకా కష్టపడి అసైన్మెంట్లు, ప్రాజెక్టులు పూర్తి చేసి చివరికి డిగ్రీ చేతికి అందుకుంటారు. ఇక అసలు కల నెరవేరే సమయం వచ్చిందనుకునే లోపే, వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది.
అమెరికాలో చదువు పూర్తయ్యాక విద్యార్థులు ఉద్యోగం చేసుకోవడానికి ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)పై ఏకంగా $70,000 ఫీజు విధించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు ప్రతిపాదించాయి. మన రూపాయి లెక్కల్లో చూస్తే ఇది సుమారు 65 నుంచి 70 లక్షల రూపాయల దాకా ఉంటుంది. దీనికి తోడు తర్వాతి దశ OPT కోసం మరో $30,000 (సుమారు రూ. 25 లక్షలు) విధించే ప్రతిపాదన కూడా తెచ్చారు. ఇప్పటికే రూ. 40-50 లక్షల దాకా అప్పులు చేసి చదివించిన మధ్యతరగతి కుటుంబాలకు ఈ కొత్త రూల్ దారుణం అనిపిస్తుంది. ఒక్కసారిగా నీరసం ఆవహిస్తుంది.
అసలు ఏంటీ కొత్త ప్రతిపాదన?
అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తాజాగా ప్రకటించిన ఈ ప్రతిపాదన ప్రకారం, F-1 వీసాపై చదువుకుంటున్న విద్యార్థికి విద్యాసంస్థలు మొదటిసారి OPTని సిఫారసు చేయాలంటే $70,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విద్యార్థి తర్వాతి దశ OPT కోసం వెళ్తే మరో $30,000 కట్టాల్సి వస్తుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం…ఇది ఇంకా చట్టంగా మారలేదు. కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులంతా వెంటనే రూ. 70 లక్షలు కట్టేయాల్సిన పరిస్థితి అయితే లేదు. కానీ, ఇది కనుక అమల్లోకి వస్తే మాత్రం డిగ్రీ అయ్యాక అక్కడే కెరీర్ మొదలుపెట్టాలనుకునే వారి కలలకు పెద్ద దెబ్బే అవుతుంది.
అంతర్జాతీయ విద్యార్థులకు OPT ఎందుకంత కీలకం?
F-1 వీసాపై అమెరికా వెళ్లే విద్యార్థులకు OPT అనేది ఒక ప్రాణవాయువు లాంటిది. కోర్సు పూర్తయ్యాక తమ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలో ఏడాది పాటు ఉద్యోగం చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఇక STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులు చేసిన వారికైతే మరో 24 నెలల అదనపు పొడిగింపు (STEM Extension) లభిస్తుంది.
అంటే మొత్తం మూడేళ్ల పాటు అమెరికాలో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడేళ్లలోనే విద్యార్థులు తాము చేసిన లోన్లను తీర్చుకోవడమే కాకుండా, H-1B వీసా వైపు అడుగులు వేస్తారు. అందుకే భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు OPTని చాలా సీరియస్‌గా తీసుకుంటారు.
ఈ భారీ ఫీజు భారం నిజంగా విద్యార్థులపైనే పడుతుందా?
ప్రతిపాదనలో ఉన్న నిబంధనల ప్రకారం ఈ $70,000 ఫీజును విద్యార్థి నేరుగా ప్రభుత్వానికి చెల్లించడు. యూనివర్సిటీయే ముందుగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. యూనివర్సిటీలు ఈ భారీ మొత్తాన్ని తమ స్వంత జేబుల నుంచి భరించే ప్రసక్తి ఉండదు.
ఆ ఫీజును విద్యార్థుల ఫీజుల రూపంలోనో, లేదా ఉద్యోగం ఇచ్చే కంపెనీల నుంచో వసూలు చేసుకునే వెసులుబాటును ఈ ప్రతిపాదనలో పొందుపరిచారు. చివరికి ఆ భారం మళ్లీ విద్యార్థి లేదా వారిని తీసుకునే కంపెనీల పైనే పడుతుంది. చిన్న కంపెనీలు ఇంత పెద్ద మొత్తాన్ని భరించి అంతర్జాతీయ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు వెనుకాడవచ్చు.
STEM విద్యార్థుల పరిస్థితి మరింత దారుణం
మనం సాధారణంగా చూసే తెలుగు విద్యార్థుల్లో దాదాపు 80 శాతానికి పైగా STEM కోర్సులకే వెళ్తుంటారు. వీరికి మొదట ఇచ్చే OPTతో పాటు మరో 24 నెలల ఎక్స్టెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే కొత్త ఫీజుల లెక్క ప్రకారం, మొదటి OPT కి $70,000, రెండో దశకు $30,000 కలిపి మొత్తం లక్ష డాలర్లు ($100,000) చెల్లించాల్సి వస్తుంది.
మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 83 నుంచి 85 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక విద్యార్థి మూడేళ్లు అక్కడ పనిచేసి తన కాళ్లపై తాను నిలబడాలంటే, లక్ష డాలర్ల ఫీజు భారాన్ని తట్టుకోవాల్సి రావడం అనేది మామూలు విషయం కాదు.
తెలుగు మధ్యతరగతి కుటుంబాలపై పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా కుటుంబాలు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి
ట్రంప్ ప్రభుత్వం లేదా DHS ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది?
అమెరికా ప్రభుత్వం వైపు నుంచి చూస్తే వారు దీనికి వేరే కారణాలు చెప్తున్నారు. OPT ప్రోగ్రామ్‌లో జరుగుతున్న మోసాలను, దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు DHS పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు తమ దేశీయ పౌరుల (అమెరికన్ల) ఉద్యోగ భద్రతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశమని చెప్తున్నారు.
పైగా, గతంలో జరిగిన కొన్ని తనిఖీల్లో దాదాపు 10,000కు పైగా నకిలీ OPT కేసులను ICE అధికారులు గుర్తించారు. అయితే NAFSA వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంతటి భారీ ఫీజులు పెడితే అమెరికాకు వచ్చే గ్లోబల్ టాలెంట్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న విద్యార్థులు ఏం చేయాలి?
ఇది ఇంకా ఖరారైన రూల్ కాదనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. DHS ప్రస్తుతం అక్టోబర్ 8 నుంచి నవంబర్ 9 వరకు ప్రజలు, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలను (Public Comments) స్వీకరిస్తోంది. ఆ తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్రతిపాదన చట్టంగా మారే క్రమంలో అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కూడా మెండుగా ఉంది. కాబట్టి ఇప్పుడే కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఏదైమైనా…
ఇకపై అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు తమ లెక్కలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు “కోర్సు పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది?” అని మాత్రమే ఆలోచించేవారు, కానీ ఇకపై “చదువు అయిపోయాక ఉద్యోగంలో చేరడానికి ఎంత ఖర్చవుతుంది?” అనే విషయాన్ని కూడా ప్లానింగ్‌లో చేర్చుకోవాల్సి వస్తుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








