నోబెల్ నాకే రావాలి.. వస్తుందో, రాదో.. ట్రంప్
ప్రపంచాన్ని శాంతిమార్గంలో నడిపిస్తున్నా.. నోబెల్ వస్తుందో రాదో..రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపేందుకుప్రయత్నిస్తున్నా.. నోబెల్ వస్తుందో , రాదో.. భారత్-పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ ను ఒక్కప్రకటనతో ఆపా.. నోబెల్ వస్తుందో .. రాదో.. ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపా..నాకంటే శాంతి బహుమతికి అర్హులెవరుంటారు.. అయినా నాకు నోబెల్ఇస్తారో ..లేదో అదీ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అనుమానం. నోబెల్ శాంతి బహుమతి తనకు ఇస్తేనే కరెక్టంటున్నారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ‘నోబెల్’ ఆకాంక్షను బయటపెట్టారు. తానేమీ గొప్పలు చెప్పడం లేదని, ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ మళ్లీ చాటింపు వేసుకుంటున్నారు. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తోన్న ఆయన.. శాంతి బహుమతి (Nobel Peace Prize) ప్రకటన వేళ హడావుడి మొదలుపెట్టారు.
‘‘ఇంకెవరూ చేయలేని పనులు నేను చేశాను. నేను గొప్పలు చెప్పడం లేదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ఏ అధ్యక్షుడు కూడా ఇన్ని యుద్ధాలకు పరిష్కారం చూపించి ఉండకపోవచ్చు. నేను 8 యుద్ధాలు ఆపాను. నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు నేను అర్హుడిని. కానీ అది నాకు వస్తుందనే నమ్మకం మాత్రం తక్కువే. వారి నిర్ణయం ఏంటో నాకు తెలియదు. నాలాంటి వారికి ఈ పురస్కారం ఇవ్వకపోవడమే వారికి అలవాటుగా కనిపిస్తోంది’’ అని ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలు చేశారు.
నోబెల్ శాంతి బహుమతిని ఏటా నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తోంది. 2026 ఏడాదికిగానూ ఈ పురస్కారాన్ని అక్టోబర్ 9న ప్రకటించనున్నారు. గతేడాది కూడా నోబెల్‌పై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు అది దక్కడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. ఈ ఏడాది నామినేషన్లలో ట్రంప్ పేరు ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఎవరిని వరిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.








