ఉత్తరాంధ్ర వలసల ఉధృతికి జగన్ బ్రేక్ వేయగలరా..?
ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా ఊహించని రీతిలో పొలిటికల్ అలజడి నడుస్తోంది. విజయనగరంలో కీలక నేత చిన్న శ్రీను పార్టీ మారడం, ఆయన వెనుకే గ్రౌండ్ లెవెల్ లీడర్స్ అంతా సైకిల్ ఎక్కడం.. ఆ ఎఫెక్ట్ విశాఖ, శ్రీకాకుళం జిల్లాలపై కూడా పడటంతో పార్టీ తీవ్ర రక్షణలో పడింది. ఈ నేపథ్యంలో, ఉత్తరాంధ్రలో పార్టీకి అసలైన వెన్నుముకగా ఉన్న వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకును కాపాడుకోవడం ద్వారా, వలసల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన విశాఖపట్నం వేదికగా భారీ ‘బీసీ గర్జన’ బహిరంగ సభను నిర్వహించేందుకు వైసిపి సమరశంఖం పూరించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతో, ఇదే సరైన సమయమని జగన్ భావిస్తున్నారు. ఈ ‘బీసీ గర్జన’ సభ ద్వారా కూటమి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందనే అంశాన్ని ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్లాలని వైసిపి ప్లాన్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
బీసీల సమస్యలపై గళమెత్తడం ద్వారా, ఉత్తరాంధ్రలో మెజారిటీగా ఉన్న ఈ సామాజిక వర్గాన్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవచ్చనేది వైసిపి అంతర్గత వ్యూహం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. విశాఖ సభ వైసిపి క్యాడర్లో కొంత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉన్నప్పటికీ, వలసలను పూర్తిస్థాయిలో అడ్డుకుంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం వైసిపిని వీడుతున్న చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు కేవలం సామాజిక సమీకరణాల వల్ల మాత్రమే వెళ్లడం లేదు.
భవిష్యత్తు రాజకీయ మనుగడ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అవకాశాలను చూసుకుని కొందరు టీడీపీ వైపు, మరికొందరు సేఫ్గా జనసేన వైపు వెళ్తున్నారు. గతంలో జగన్ను నమ్మినట్లు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లీడర్స్ నమ్మలేకపోతున్నారనేది నిష్టూర సత్యం. కేవలం ఒక బహిరంగ సభతోనే నాయకుల్లో ఉన్న అసంతృప్తి చల్లారుతుందని చెప్పలేం. అయినప్పటికీ, ఈ ‘బీసీ గర్జన’ సభ ద్వారా ఉత్తరాంధ్రలో వైసిపి ఇంకా బలంగానే ఉందనే సిగ్నల్ ప్రత్యర్థి పార్టీలకు పంపడంతో పాటు, పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఊగిసలాట నేతలను కాస్త ఆపవచ్చని జగన్ నమ్ముతున్నారు. ఈ నెల 16న విశాఖ వేదికగా జరగబోయే ఈ గర్జన.. వైసిపికి తిరిగి ఊపిరి పోస్తుందో లేదో చూడాలి.








