మోదీ గద్దె దిగు.. లేకుంటే ప్రజలే దింపుతారు : సీఎం రేవంత్ రెడ్డి
* జనాభా 140 కోట్లు దాటితే 13 కోట్ల ఓట్ల గల్లంతు ఎలా?
* దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్ల తొలగింపు వెనుక భారీ కుట్ర
* ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించలేవు
* ఓటు బచావో… దేశ్ బచావో ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే భర్తరప్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గద్దెను ఖాళీ చేయాలని, లేకపోతే ప్రజలే ఆయనను గద్దె దించుతారని సీఎం అన్నారు. ఓటు బచావో… దేశ్ బచావో ఉద్యమంలో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇండియా కూటమి నేతలు గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్ వద్ద నివాళుల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఓటు బచావో… దేశ్ బచావో ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోసమో, ఇండియా కూటమి కోసమో కాదని, దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరిందని సీఎం గుర్తుచేశారు. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఎం తెలిపారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, ఓటర్ల సంఖ్య మరింతగా పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్ల గల్లంతు అయ్యాయని, అవి ఎలా తగ్గిపోయాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి వారు ప్రాణాలకు తెగించి పోరాడారని, స్వాతంత్య్రం తెచ్చారని సీఎం అన్నారు. సంపన్నులు, పేదలు తేడా లేకుండా డాక్టర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారన్నారు. ఇప్పటి వరకు సర్ ఎన్నిసార్లు జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదని సీఎం అన్నారు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం మండిపడ్డారు.
కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా, రెండు వర్గాలుగా విభజిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరో వైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేష్ కుమార్ పరిస్థితులను మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకొని వాటిని తొలగిస్తున్నారని సీఎం ఆరోపించారు.








