పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ హసన్ నవాజ్ సంచలన నిజాలు..!
భారత్-పాకిస్థాన్(Ind Vs Pak) మ్యాచ్ అంటేనే మైదానంలో హై వోల్టేజ్ టెన్షన్ ఉంటుంది. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ ఫైనల్ పోరులో టీమిండియా చేతిలో ఘోర పరాజయాన్ని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. భారత్ చేతిలో ఓడిపోయి బంగారు పతకాన్ని చేజార్చుకోవడంపై పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ హసన్ నవాజ్ బుధవారం మీడియా ముందు తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. “ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడం నన్ను ఇప్పటికీ తీవ్రంగా కలచివేస్తోంది, ఎంతో బాధ కలిగిస్తోంది” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ టైటిల్ పోరులో పాకిస్థాన్ తరఫున ఒంటరి పోరాటం చేస్తూ 96 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయానని హసన్ నవాజ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. “మేము మ్యాచ్ గెలుస్తామని నేను గట్టిగా నమ్మాను. ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టు అయిన భారత్‌తో ఆడటం ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజ్. మ్యాచ్ చివర్లో జస్ప్రీత్ బుమ్రా ఓవర్ ఒక్కటే మిగిలి ఉందని, మిగతా బౌలర్లను టార్గెట్ చేయవచ్చని వాతావరణాన్ని బట్టి బ్యాటింగ్ చేశాను. కానీ రన్ చేజ్ చేస్తున్న సమయంలో మేము చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది” అని నవాజ్ విశ్లేషించారు.
దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమై, తిరిగి టీమిండియా లాంటి బలమైన జట్టుపై ఇంత మంచి ఇన్నింగ్స్‌తో పునరాగమనం చేయడం వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చినప్పటికీ, ఫైనల్ ఓటమి ఆ సంతోషాన్ని దూరం చేసిందని హసన్ నవాజ్ చెప్పారు. “ఫైనల్ ముగిసిపోయింది, మ్యాచ్‌లు వస్తూనే ఉంటాయి. మనుషులన్నాక తప్పులు చేయడం సహజం, కానీ భారత్ లాంటి జట్టును ఓడించాలంటే మాత్రం మేము చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది” అని యువ బ్యాటర్ స్పష్టం చేశారు. ఈ ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి బంగారు పతకాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే.








