ఢిల్లీలో సీఎం చంద్రబాబు మిషన్ ఏపీ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా అడుగులు వేస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర విభజన హామీలు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖపట్నం మెట్రో రైల్ వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పూర్తి ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు.
ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘2027 గోదావరి పుష్కరాల’ నిర్వహణను ప్రస్తావించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ ఆధ్యాత్మిక వేడుకల కోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా, ఏపీలో సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరేలా దక్షిణాది నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అమరావతి రాజధాని ప్రాంతానికి మణిహారంగా మారనున్న ‘అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు’ (ORR) ప్రాజెక్టుకు కేంద్ర రవాణా శాఖ తరఫున పూర్తి సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకాన్ని, రవాణాను మెరుగుపరిచేలా అక్కడ ఒక అద్భుతమైన ఐకానిక్ వంతెన (Iconic Bridge Project) నిర్మించాలని గడ్కరీకి ప్రతిపాదించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు ఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ’31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్’ (CII Partnership Summit 2026 Curtain Raiser) కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సదస్సుకు విచ్చేసిన చంద్రబాబుకు సీఐఐ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సదస్సు ప్రారంభానికి ముందే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట పలువురు కూటమి ఎంపీలు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ ద్వారా ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా పునాది పడింది.








