సింగరేణి కోసం బీఆర్ఎస్ ‘కార్మిక గర్జన’.. అసలు వ్యూహమేంటి?
తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీలిమిటెడ్ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సింగరేణి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫలమైందంటూ అక్టోబర్ 14న రామగుండం వేదికగా ‘సింగరేణి కార్మిక గర్జన’ నిర్వహించబోతోంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావు తదితరులు హాజరవుతున్నారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు దక్కే వాటా గణనీయంగా తగ్గిపోయిందనేది బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు ఏకంగా 32 శాతం లాభాల వాటా అందిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ వాటా 16 శాతానికి, ఆ తర్వాత 2024-25 నాటికి 12.5 శాతానికి పడిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. దసరాకు ముందే లాభాలు, వాటాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈసారి ఆ సంప్రదాయానికి తూట్లు పడ్డాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ. 4,712 కోట్ల లాభాలను ఆర్జించగా, 2024-25 నాటికి అవి రూ. 6,394 కోట్లకు చేరాయని బీఆర్ఎస్ చెప్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం లాభాలు రూ. 1,800 కోట్లకు మించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, పరిపాలనా వైఫల్యాలు, టెండర్లలో జాప్యం, భారీ వ్యయంతో కూడిన కాంట్రాక్టుల కారణంగానే సంస్థ ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు.. బ్యాంకుల్లో రూ.6,323 కోట్లు నిల్వ ఉన్నప్పటికీ, అదనంగా 4,000 కోట్ల ఓవర్డ్రాఫ్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి బొగ్గు గనుల ప్రాంతాలు ఏ పార్టీ రాజకీయ భవిష్యత్తునైనా నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు సింగరేణి కార్మికులను కూడగట్టడం ద్వారా ఉత్తర తెలంగాణలో మళ్లీ పట్టు సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అందిన సంక్షేమం, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోల్చి చెప్పడం ద్వారా కార్మిక లోకంలో సానుభూతిని పొందడమే లక్ష్యంగా ఈ ‘కార్మిక గర్జన’ రూపుదిద్దుకుంటోంది.
మొత్తానికి… రామగుండం వేదికగా జరగనున్న ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ చేస్తున్న వ్యూహాత్మక అడుగుగా పరిశీలకులు భావిస్తున్నారు. కార్మిక సమస్యల పేరుతో తెరపైకి వస్తున్న ఈ రాజకీయం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.








