ట్యాక్స్ ఆదా కోసం విడాకులు.. అమెరికాలో ఇదే కొత్త ట్రెండ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మొగుడూ పెళ్లాల మధ్య ఏ గొడవలు లేవు.. విడిపోవాలనే ఆలోచన కలలో కూడా లేదు! అయినా విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు ఓ భార్యాభర్తలు. మరో జంట అయితే అందరి ముందు పెళ్లి హంగామా చేసినా, విందు చేసినా..రింగులు మార్చుకుని, అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదు! ఇదంతా వినడానికి ఏదో సినిమా థ్రిల్లర్ కథలో మేటర్ లా ఉంది కదా? కానీ వీళ్ల కథలో ట్విస్ట్ ప్రేమ కాదు.. డబ్బు!
కలిసి ఉంటే వచ్చే నష్టమేంటి? విడిపోతే వచ్చే లాభమేంటి? డబ్బు కోసం పెళ్లి బంధాన్నే పక్కన పెట్టేలా చేస్తున్న ఆ రహస్య లెక్క ఏంటి? అమెరికాలో తెరపైకి వచ్చిన ఈ విచిత్రమైన పరిణామం వెనుక అసలు కథ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు!
అమెరికాలో ఇప్పుడు ఓ చిత్రమైన చర్చ నడుస్తోంది. భార్యాభర్తలుగా కలిసి ఉంటే పన్నుల మోత బారీగా పడుతుంటే, చట్టపరంగా విడాకులు తీసుకుంటే మాత్రం వేల డాలర్లు ఆదా అవుతున్నాయి. దీంతో ప్రేమ, పెళ్లి, పవిత్రమైన బంధాల మధ్యలోకి ఆర్థిక లెక్కలు, పన్ను మినహాయింపులు వచ్చి చేరాయి. కొందరు సంపన్న జంటలు అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అని, మరికొందరు పన్నులు తగ్గించుకోవడానికి విడాకులు తీసుకోవాలా అని ఆలోచించే పరిస్థితులు వచ్చాయి.
అసలు ఏంటీ ‘మ్యారేజ్ పెనాల్టీ’?
అమెరికాలో రాష్ట్ర, స్థానిక పన్నులకు ఇచ్చే మినహాయింపును ‘సాల్ట్’ (SALT – State and Local Tax Deduction) అంటారు. మనం కట్టే ఆస్తి పన్నులు, ఇన్ కమ్ టాక్స్ వంటి వాటిని చూపించి ఫెడరల్ టాక్స్ తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త చట్టంతో ఈ మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది.
ఈ 40,000 డాలర్ల లిమిట్ ఒక ఒంటరి వ్యక్తికి ఎంత వర్తిస్తుందో, వివాహం చేసుకుని ఉమ్మడిగా పన్నులు దాఖలు చేసే జంటకు కూడా అంతే వర్తిస్తుంది. అంటే విడివిడిగా టాక్స్ ఫైల్ చేస్తే ఇద్దరికీ కలిపి రూ. 80,000 డాలర్ల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కానీ పెళ్లి చేసుకుని కలిసి దాఖలు చేస్తే ఆ ప్రయోజనం సగానికి పడిపోతుంది. అందుకే దీన్ని విమర్శకులు ‘మ్యారేజ్ పెనాల్టీ’ (పెళ్లి చేసుకోవడం వల్ల పడే అదనపు భారం) అని పిలుస్తున్నారు.
విడాకులతో రూ. 17 లక్షల ఆదా!
మిచిగన్కు చెందిన 41 ఏళ్ల కెంట్ కోవాక్ కథే దీనికి మంచి ఉదాహరణ. ఈ పన్ను నిబంధన గురించి తెలుసుకున్న ఆయన, తన 11 ఏళ్ల వైవాహిక బంధానికి చట్టపరంగా కాగితాలపై ముగింపు పలికితే తమ కుటుంబానికి భారీగా డబ్బు మిగులుతుందని లెక్కలేశారు. అలా ఆదా చేసిన డబ్బుతోనే ఆయన భార్య సాగు చేసుకునే వ్యవసాయ క్షేత్రం కోసం ఏకంగా 12,000 డాలర్లతో ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశారు.
చట్టబద్ధంగా విడాకులు తీసుకుని, ఎప్పటిలాగే ఒకే ఇంట్లో కలిసి జీవిస్తే ఏటా 20,000 డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 17 లక్షలకు పైగా) ఆదా చేసుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ఇది భార్యాభర్తల బంధాన్ని తెంచుకోవడం కాదని, కేవలం ఒక ఆర్థిక పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని ఆయన సమర్థించుకుంటున్నారు.
పెళ్లిళ్లకు గుడ్ బై.. ప్రత్యామ్నాయ దారులు!
ఈ పన్ను లొసుగుల వల్ల కొందరు అమెరికన్లు అసలు పెళ్లే వద్దనుకుంటున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసే పీటర్ అనే టెక్ ఉద్యోగి, తన భాగస్వామితో కలిసి బంధువుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి వేడుక చేసుకున్నారు. కానీ అధికారికంగా లీగల్ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోకుండా, కాలిఫోర్నియాలో అందుబాటులో ఉన్న ‘డొమెస్టిక్ పార్ట్నర్షిప్’ కింద పేరు నమోదు చేసుకున్నారు.
దీనివల్ల స్టేట్ లా ప్రకారం రావాల్సిన హక్కులు పొందుతూనే, పన్నుల విషయంలో మాత్రం సింగిల్స్గానే ఉంటూ ఏడాదికి 20,000 డాలర్లు మిగుల్చుకుంటున్నారు. మరో జంట కూడా ఇలాగే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుని, లీగల్ సర్టిఫికేట్ లేకుండా డొమెస్టిక్ పార్ట్నర్లుగా మారి ఏటా 27,000 డాలర్లు ఆదా చేస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రయోజనం అందరికీ దక్కదు!
అయితే ఈ పన్ను ఆదా ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు. 2026 నాటికి 40,400 డాలర్ల పూర్తి సాల్ట్ (SALT) మినహాయింపు పొందాలంటే ఆ వ్యక్తి లేదా జంట ఆదాయం 505,000 డాలర్లకు మించకూడదు. ఆ పైన ఆదాయం ఉంటే ఈ మినహాయింపులు తగ్గిపోతాయి.
అంతేకాకుండా సాధారణ స్టాండర్డ్ డిడక్షన్ కంటే విడివిడిగా లెక్కించే ఐటమైజ్డ్ డిడక్షన్స్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ పద్ధతి వర్తిస్తుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి ఇంత మొత్తంలో ఆదా అవుతుందని చెప్పలేము.
కాగితాలపై విడాకులు.. ఎంతవరకు సురక్షితం?
కేవలం టాక్స్ ఆదా కోసం విడాకులు తీసుకోవడం ఆర్థికంగా మంచిదే అనిపించినా, భవిష్యత్తులో లీగల్ సమస్యలు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టబద్ధంగా భార్యాభర్తలు కాకపోతే అత్యవసర వైద్య సమయంలో భాగస్వామి తరఫున నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు.
సరిగ్గా ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోకపోతే ఒకరు చనిపోయాక ఆస్తులు, రిటైర్మెంట్ ఫండ్స్ రెండో వారికి సులభంగా దక్కవు. అమెరికా ప్రభుత్వం ఇచ్చే సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు, వారసత్వ ఆస్తి బదిలీ పన్ను మినహాయింపులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
తాత్కాలిక ప్రయోజనాల కోసం పెద్ద రిస్క్!
ఈ సాల్ట్ (SALT) పన్ను నిబంధనలు శాశ్వతమైనవి కావు. 2026 నుంచి 2029 వరకు ఇవి కొద్దిగా పెరిగినా, 2030 నాటికి మళ్లీ పాత పద్ధతిలోనే 10,000 డాలర్లకు పడిపోయే అవకాశం ఉంది. రాజకీయనాయకులు మార్చే పన్ను చట్టాల కోసం జీవితకాలపు బంధాలను, చట్టపరమైన రక్షణలను వదులుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా, దంపతుల్లో ఒకరి ఆదాయం చాలా ఎక్కువగా ఉండి, ఇంకొకరి ఆదాయం తక్కువగా ఉంటే కలిసి పన్నులు దాఖలు చేయడమే లాభదాయకం. కాబట్టి పన్నుల కోసం తొందరపడి విడాకులు తీసుకోవడం లేదా పెళ్లిని వాయిదా వేసుకోవడం సరికాదని, సొంత ఆదాయం, భవిష్యత్ భద్రతను బట్టి ఆలోచించుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.








