కూటమి సీట్లు కొలిక్కి వస్తాయా..?
ఆంధ్రప్రదేశ్లో రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షమైన ఎన్డీయే (NDA) కూటమి అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నివాసంలో కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతల అత్యంత కీలక సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, సమన్వయమే ప్రధాన ఎజెండాగా ఈ ఉన్నత స్థాయి సమీక్ష సాగింది.
ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొని తమ పార్టీల అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. వీరితో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ భేటీలో భాగస్వామ్యమై నియోజకవర్గాల వారీగా ఉన్న సమీకరణాలపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల నాటి సీట్ల పంపకాల ఫార్ములాను వర్తింపజేయడం కుదరదని కూటమి నేతలు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
జనసేన, బీజేపీలు బలంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డు స్థానాల్లో ఆయా పార్టీలకే ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ బలాన్ని బట్టి సీట్ల కేటాయింపు జరగాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (BC) 34 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని నేతలు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా ఉండేందుకు, జిల్లా మరియు నియోజకవర్గాల వారీగా టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో కూడిన ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయిన తర్వాత సీట్ల పంపకాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని, ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి నిలబడినా కూటమి విజయమే లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విపక్ష వైఎస్సార్సీపీ ఇప్పటికే మేయర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేయడంతో, దానికి గట్టి కౌంటర్ ఇచ్చేలా కూటమి అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కూడా వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ఎన్డీయే అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ భేటీతో స్థానిక సమరానికి కూటమి శ్రేణులు సమరశంఖం పూరించినట్లయింది.








