మేయర్ రేసులో వైఎస్సార్సీపీ స్పీడ్..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకోవడంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. కూటమి ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చేలా బలమైన నేతలను బరిలోకి దించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) రేపు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని జగన్ భావిస్తున్నారు.
స్థానిక సమరంలో అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి సైకలాజికల్ అడ్వాంటేజ్ దక్కించుకోవాలనే వ్యూహంతో వైఎస్సార్సీపీ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆనం విజయ్‌కుమార్ రెడ్డి పేరును వైఎస్ జగన్ అధికారికంగా ఖరారు చేశారు. రిజర్వేషన్ల సమీకరణాలను బేస్ చేసుకుని రేపు జరగబోయే రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో మిగిలిన ప్రధాన నగరాల మేయర్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కీ-కార్పొరేషన్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, ఒంగోలు, కడప, అనంతపురం నగరాల మేయర్ అభ్యర్థులను రేపటి సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. ఇప్పటికే గుంటూరు మేయర్ స్థానానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు లీకులు వస్తుండటంతో, రేపటి అధికారిక లిస్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయాలని రీజనల్ కోఆర్డినేటర్లకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. పోలింగ్ బూత్ ల వారీగా నిఘా ఉంచడం, అభ్యర్థుల ఆర్థిక, సామాజిక బలాలను అంచనా వేయడం వంటి అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితర ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ వన్-టు-వన్ సమీక్షించనున్నారు. రేపటి ప్రకటనతో ఏపీ మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత ఊపందుకోనుంది.








