గాల్లోకి ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ఒక్క సెకనులో 97 కి.మీ. వేగం
కార్లు రోడ్డుపై పరుగెత్తడం చూశాం.. రేసింగ్ కార్లు క్షణాల్లో స్పీడు పెంచడం చూశాం. కానీ ఒక కారు ర్యాంప్‌పై నుంచి గాల్లోకి ఎగిరి, మధ్యలో పల్టీలు కొట్టి, తిరిగి నేలపై దిగితే? వినడానికి ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో యాక్షన్ సీన్ లా ఉన్నా టెస్లా రోడ్‌స్టర్ కారు ఈ విన్యాసాలని నిజం చేయటానికి ప్రయత్నిస్తోంది. ఎలాన్ మస్క్ కంపెనీ రూపొందిస్తున్న ఈ కారు నిజంగానే రాకెట్లా ఎగురుతుందా? లేక ఇది మరో సంచలనాత్మక ప్రచారమా?
Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI
— Elon Musk (@elonmusk) October 16, 2026
రాకెట్లా ఎగిరే కారు.. గాల్లోనే పల్టీలు!
టెస్లా సెకండ్ జనరేషన్ రోడ్‌స్టర్‌కు సంబంధించిన ప్రదర్శన గురించి ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. కారు ఒక భారీ వంపు ఆకారంలోని ర్యాంప్‌పైకి దూసుకెళ్లి, గాల్లోకి ఎగిరి, మధ్యలో పల్టీ కొట్టి తిరిగి నేలపై దిగింది.
ఈ విన్యాసాల వెనుక రాకెట్లలో ఉపయోగించే థ్రస్టర్ టెక్నాలజీ ఉందని చెప్తున్నారు ఈ వ్యవస్థ ద్వారా కారుకు అదనపు త్రోస్ట్ అందించి, గాల్లో దాని కదలికలను నియంత్రించవచ్చన్నట్లుగా నిపిస్తోంది.
ఒక్క సెకనులో 97 కి.మీ. వేగం.. నమ్మగలమా?
ఈ రోడ్‌స్టర్ గురించి మరో సంచలనాత్మక విషయం…కేవలం ఒక్క సెకనులోనే గంటకు 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదనేది. అదే నిజమైతే, ఇది మామూలు విషయం కాదు.
కానీ ఇక్కడే అందరికీ సందేహం మొదలవుతోంది. ఈ వేగాన్ని సాధారణ ఎలక్ట్రిక్ మోటార్లతో అందుకుంటుందా? రాకెట్ థ్రస్టర్ల సహాయంతో అందుకుంటుందా? ఇది క్లారిటీ రావాల్సిన విషయం.
రూ.48 లక్షలు కడితే బుకింగ్ చేసుకోవచ్చా?
రోడ్‌స్టర్‌ను బుక్ చేసుకోవడానికి 50,000 డాలర్ల డిపాజిట్ అవసరమని చెప్తున్నారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.48 లక్షలు . ఈ డిపాజిట్‌ను పూర్తిగా తిరిగి పొందవచ్చని కూడా పేర్కొంది. అయితే, ఇది కేవలం బుకింగ్ డిపాజిట్ మాత్రమే. కారు మొత్తం ధర రూ.48 లక్షలని అర్థం కాదు. ప్రస్తుత బుకింగ్ నిబంధనలు, తుది ధరను టెస్లా అధికారిక సమాచారం ద్వారా నిర్ధారించుకోవాలి.
2017లోనే ప్రకటించారు.. మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదు?
ఈ కథలో ఆసక్తికరమైన అంశం ఇదే. టెస్లా రెండో తరం రోడ్‌స్టర్‌ను 2017 నవంబర్లోనే ప్రకటించింది. తొలుత 2020 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని భావించినప్పటికీ, ఉత్పత్తి గడువు పలుమార్లు వాయిదా పడింది.
ఇప్పుడు 2028లో ఉత్పత్తి ప్రారంభమవుతుందనే సమాచారం వినిపిస్తోంది. అంటే, తొలి ప్రకటన తర్వాత దాదాపు పదేళ్లకు ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే, ఈ గడువు కూడా అధికారికంగా అమలవుతుందా లేదా అనేది చూడాలి.
టెస్లా, స్పేస్ఎక్స్ టెక్నాలజీ కలిస్తే?
ఈ ప్రాజెక్టులో టెస్లా, స్పేస్ఎక్స్ ఇంజినీర్లు కలిసి పనిచేస్తున్నట్లు కథనం పేర్కొంది. అంతరిక్షంలో ఉపగ్రహాల దిశను మార్చేందుకు ఉపయోగించే కోల్డ్ గ్యాస్ థ్రస్టర్ టెక్నాలజీకి సంబంధించిన ఆలోచన ఇందులో భాగమని వివరించింది.
సాధారణంగా అధిక పీడనంతో గాలిని లేదా వాయువును బయటకు విడుదల చేయడం ద్వారా థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే, అంతరిక్షంలో పనిచేసే ఈ తరహా సాంకేతికతను రోడ్డుపై నడిచే కారులో ఉపయోగించడం అంత సులభం కాదు. వాహనం నియంత్రణ, ప్రయాణికుల భద్రత, రోడ్డు నిబంధనలు వంటి అనేక సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుంది.
అసలు ట్విస్ట్ ఇదే.. ఇది నిజంగా రోడ్లపైకి వస్తుందా?
ఎలాన్ మస్క్ కొత్త ఆవిష్కరణలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. టెస్లా రోడ్‌స్టర్ కూడా అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి. అయితే, ఈసారి ప్రచారంలో ఉన్న గాల్లో ఎగిరే కారు నిజమైతే అది ఆటోమొబైల్ రంగంలో ఆసక్తికరమైన పరిణామం అవుతుంది.
అయితే ఒక ప్రదర్శనలో విన్యాసాలు చేయడం వేరు.. లక్షలాది మంది వినియోగదారులు నిత్యం ఉపయోగించే కారుగా తయారు చేయడం వేరు. ధర, భద్రత, చట్టపరమైన అనుమతులు, ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలే ఈ ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








