తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఒంటరితనం.. మీ ప్రేమతో వారికి భరోసా ఇవ్వండి!
ఒకప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల (Parents)మాటే ధైర్యం.. వారి ఉనికే కుటుంబానికి భరోసా. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, తమ అవసరాలను పక్కనపెట్టి జీవితమంతా కుటుంబం కోసమే కష్టపడతారు. పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా రాత్రంతా నిద్రపోకుండా చూసుకుంటారు. ఆకలితో ఉన్నా పిల్లల కడుపు నింపిన తర్వాతే తాము తింటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ కుటుంబ సంబంధాల్లోనూ (Family Relations) మార్పులు కనిపిస్తున్నాయి. వృద్ధాప్యంలో (Oldage) తల్లిదండ్రులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, వారితో గడిపే సమయం, చూపించే ఆప్యాయత తగ్గిపోతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఒకప్పుడు ప్రేమకు కేంద్రంగా ఉన్న ఇంట్లోనే క్రమంగా బాధ్యతగా మారిపోతున్నారనే ఆవేదన కనిపిస్తోంది.
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల భావోద్వేగాలు
ఉద్యోగాలు, ఆర్థిక ఒత్తిళ్లు (Financial Burdens) , పిల్లల చదువులు, వ్యక్తిగత జీవితంతో బిజీగా ఉండటం నేటి తరానికి సాధారణమైంది. మెరుగైన అవకాశాల కోసం చాలామంది సొంత ఊళ్లను వదిలి ఇతర నగరాలు, దేశాల్లో స్థిరపడుతున్నారు. ఇది తప్పు కాదు. ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని నిర్మించుకునే హక్కు ఉంది. కానీ ఈ ప్రయాణంలో తల్లిదండ్రులతో భావోద్వేగ అనుబంధం కూడా దూరమైతేనే సమస్య మొదలవుతుంది. మందులు పంపించడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఖర్చులకు డబ్బులు ఇవ్వడం వంటి పనులు చేసినంత మాత్రాన వారి పట్ల మన బాధ్యత పూర్తయినట్లు కాదు.

వయసు పెరిగేకొద్దీ తల్లిదండ్రుల శారీరక సామర్థ్యం తగ్గుతుంది. గతంలో అన్ని పనులు స్వయంగా చేసుకున్నవారు చిన్న విషయాలకు కూడా పిల్లల సహాయం కోరాల్సి వస్తుంది. ఒకే విషయాన్ని పదేపదే అడగడం, పాత జ్ఞాపకాలను మళ్లీ చెప్పడం, పిల్లలతో ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకోవడం వంటివి కొన్నిసార్లు వారికి అలవాటుగా మారుతాయి. పిల్లలకు ఇవి విసుగుగా అనిపించవచ్చు. కానీ తల్లిదండ్రుల కోణంలో చూస్తే, అవి ఒంటరితనాన్ని (Lonilieness) తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. తమ జీవితంలో పిల్లలకు ఇంకా ప్రాధాన్యం ఉందనే భరోసాను వారు కోరుకుంటారు.
ఇవి కూడా చదవండి
తల్లిదండ్రులపై ప్రేమ, బాధ్యత
ఇక్కడే బాధ్యతకు, బంధానికి మధ్య ఉన్న తేడా స్పష్టమవుతుంది. తల్లిదండ్రులకు సమయానికి భోజనం పెట్టడం, మందులు ఇవ్వడం, వైద్య పరీక్షలు చేయించడం అవసరమే. అయితే వారితో ప్రేమగా మాట్లాడటం, వారి మాటలను శ్రద్ధగా వినడం, నిర్ణయాల్లో భాగస్వాములను చేయడం కూడా అంతే ముఖ్యం. ఫోన్ చేసి మందులు వేసుకున్నారా అని అడగడం ఒక బాధ్యత. అదే ఫోన్లో వారి రోజు ఎలా గడిచిందో తెలుసుకోవడం, పాత జ్ఞాపకాలను పంచుకోవడం బంధాన్ని బలపరుస్తుంది.

వృద్ధుల సంరక్షణ విషయంలో పిల్లలపై కూడా ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదు. ఉద్యోగం, సొంత కుటుంబం, పిల్లల పెంపకం, ఆర్థిక అవసరాల మధ్య సమతుల్యత సాధించడం సులభం కాదు. అందుకే కుటుంబ సభ్యులంతా బాధ్యతలను పంచుకోవాలి. అవసరమైతే నమ్మకమైన సంరక్షకుల సహాయం తీసుకోవచ్చు. వృద్ధాశ్రమంలో ఉంచాల్సిన పరిస్థితి వచ్చినా అది ప్రేమలేనితనానికి నిదర్శనం కాదు. వారి భద్రత, సౌకర్యాలు, గౌరవం కాపాడుతూ పిల్లలు నిరంతరం వారితో అనుబంధాన్ని కొనసాగించడం ముఖ్యం.
తల్లిదండ్రులపై గౌరవం, ఆప్యాయత
తల్లిదండ్రులను గౌరవించడం గురించి పిల్లలకు మాటల్లో చెప్పడం కంటే, మన ప్రవర్తనతో చూపించడం ఎంతో ప్రభావవంతం. మన పిల్లలు తాతయ్య, అమ్మమ్మలతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో గమనిస్తారు. వృద్ధులను ఓపికగా చూసుకోవడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా కుటుంబ బంధాల అసలైన అర్థాన్ని తరువాతి తరానికి తెలియజేయవచ్చు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు చేసిన త్యాగాలకు ప్రతిఫలం ఆశిస్తూ జీవితాన్ని గడపరు. వృద్ధాప్యంలో తమను భారంగా కాకుండా ఆప్యాయతతో చూసుకోవాలని కోరుకుంటారు. వారి మాటలకు సమయం కేటాయించడం, చిన్న అవసరాలను గుర్తించడం, ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించడం పెద్ద త్యాగాలేమీ కావు. కానీ ఆ చిన్న పనులే వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. తల్లిదండ్రుల సంరక్షణ మన బాధ్యత కావచ్చు. కానీ వారు మన జీవితంలో ఇంకా ముఖ్యమైనవారనే భావన కలిగించడం మన బంధంలోని ప్రేమకు నిదర్శనం. వారు మనకు అవసరమైనప్పుడు అండగా నిలిచినట్లే, ఇప్పుడు వారికి మన ఆప్యాయత అవసరం. బాధ్యతను నిర్వర్తించడంతో పాటు బంధాన్ని కాపాడుకున్నప్పుడే కుటుంబానికి నిజమైన అర్థం ఉంటుంది.








