భ్రమరాంబికాదేవి: భ్రమరాల రూపంలో రాక్షస సంహారం! (దేవీ భాగవత కథలు)
—సూర్య ప్రకాష్ జోశ్యుల
దేవతలనే గడగడలాడించిన అరుణాసురుడిని అంతం చేయడానికి అమ్మవారు ఎంచుకున్న మార్గం ఏమిటి? శస్త్రాస్త్రాలకు లొంగని రాక్షసుడిని లక్షలాది భ్రమరాలతో సంహరించిన జగన్మాత అద్భుత గాథ ఇది.
ఒకానొకప్పుడు పాతాళలోకంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడికి అపారమైన బలపరాక్రమాలు ఉన్నాయి.దేవతలను ఓడించి, ముల్లోకాలపై ఆధిపత్యం సాధించాలన్నదే అతడి ఏకైక లక్ష్యం. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు.
వేల సంవత్సరాల పాటు ఆహారాన్ని క్రమంగా విడిచిపెడుతూ, చివరకు నిరాహారంగా తపస్సు చేశాడు. అతడి శరీరం నుంచి వెలువడిన అగ్నిజ్వాలలకు లోకాలన్నీ అల్లాడిపోయాయి. దేవతలంతా బ్రహ్మదేవుడిని శరణు వేడారు.
గాయత్రీదేవితో కలిసి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడిని చూసి అరుణాసురుడు ఆనందంతో నమస్కరించాడు.
“స్వామీ! నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి” అని కోరాడు.
అయితే పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదని బ్రహ్మదేవుడు చెప్పాడు. దీంతో అరుణాసురుడు మరో వరం కోరుకున్నాడు.
“శస్త్రాస్త్రాల వల్లగానీ, స్త్రీ వల్లగానీ, పురుషుడి వల్లగానీ నాకు మరణం కలగకూడదు. రెండు కాళ్లు ఉన్న జీవుల వల్లగానీ, నాలుగు కాళ్లు ఉన్న ప్రాణుల వల్లగానీ నా ప్రాణాలు పోకూడదు. దేవతలతో యుద్ధం చేసిన ప్రతిసారీ విజయం నాకే దక్కాలి” అని అడిగాడు.
బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అన్నాడు.
వరగర్వంతో విర్రవీగిన అరుణాసురుడు తన రాక్షస సేనతో దేవలోకంపై దండెత్తాడు. దేవతలను ఓడించి, దిక్పాలకులను సైతం శాసించడం ప్రారంభించాడు. దిక్కుతోచని దేవతలు కైలాసానికి చేరుకుని శివుడిని ప్రార్థించారు.
అప్పుడు ఆకాశవాణి ఒక ఉపాయాన్ని సూచించింది.
అరుణాసురుడు నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తుంటాడని, అతడు ఆ జపాన్ని విడిచిపెట్టేలా చేస్తే అతడి శక్తి క్షీణిస్తుందని తెలిపింది. దేవతల గురువైన బృహస్పతి ఈ బాధ్యతను స్వీకరించాడు.
అరుణాసురుడి దగ్గరకు వెళ్లిన బృహస్పతి, “నువ్వు ఆరాధించే గాయత్రీ మంత్రాన్నే మేమూ జపిస్తాం. అలాంటప్పుడు మనమంతా శత్రువులం ఎలా అవుతాం?” అని ప్రశ్నించాడు.
దేవతలతో తనను పోల్చడాన్ని అవమానంగా భావించిన అరుణాసురుడు విచక్షణ కోల్పోయాడు. ఆగ్రహంతో గాయత్రీ మంత్ర జపాన్ని విడిచిపెట్టాడు. అతడి తేజస్సు క్రమంగా క్షీణించింది.
మరోవైపు దేవతలంతా ఆదిపరాశక్తిని ఏకాగ్రతతో ప్రార్థించసాగారు. వారి భక్తికి ప్రసన్నమైన జగన్మాత.. అద్భుతమైన రూపంలో ప్రత్యక్షమైంది.
ఆమె దివ్యశరీరం ఆభరణాలతో మెరిసిపోతోంది. చేతుల్లో భ్రమరాలు ఉన్నాయి. చుట్టూ అసంఖ్యాకమైన భ్రమరాలు గుంపులుగా పరిభ్రమిస్తున్నాయి. వాటి శబ్దంతో దిక్కులన్నీ మారుమోగుతున్నాయి.
దేవతలు ఆ జగన్మాతను దర్శించి తమ బాధను విన్నవించుకున్నారు.
వెంటనే అమ్మవారు తన దివ్యశక్తి నుంచి అసంఖ్యాకమైన భ్రమరాలను వెలువరించింది. అవి ఆకాశాన్ని కమ్మేస్తూ ముల్లోకాలలోని రాక్షసులపై విరుచుకుపడ్డాయి. ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా రాక్షసులను చుట్టుముట్టి సంహరించాయి.
శస్త్రాస్త్రాలకు లొంగని అరుణాసురుడు సైతం ఆ భ్రమరాల దాడికి తట్టుకోలేకపోయాడు. అతడితో పాటు రాక్షస సేన మొత్తం నశించింది. భ్రమరాలు తిరిగి జగన్మాతలో లీనమయ్యాయి.
దేవతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముల్లోకాలలో జయజయధ్వానాలు మారుమోగాయి. మునులు వేదమంత్రాలు పఠించారు. గంధర్వులు గానాలు చేశారు. దేవతలందరూ ఆ తల్లికి నమస్కరించారు.
భ్రమరాంబిక అనే పేరు ఎలా వచ్చింది?
భ్రమరాల రూపంలో దుష్టశక్తులను సంహరించి దేవతలకు అభయమిచ్చిన జగన్మాతను భ్రమరి దేవిగా స్మరిస్తారు. ఈ దివ్యరూపంతో అనుసంధానమైన భ్రమరాంబికాదేవి, శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామివారితో కలిసి పూజలందుకుంటోంది.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ॥
సర్వమంగళాలను ప్రసాదించే తల్లీ! శరణు కోరినవారిని రక్షించే గౌరీదేవీ! మమ్మల్ని అనుగ్రహించు తల్లీ!
ఓం శ్రీ భ్రమరాంబికాయై నమః!








