ట్రోలింగ్‌కు భయపడితే ఇంట్లోనే ఉండేవాడిని!
సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా నటించిన రణబాలి(Ranabaali) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరైన హరీష్ శంకర్.. ఆన్లైన్లో విజయ్ ఎదుర్కొంటున్న విమర్శలపై స్పందించారు. ఒక వ్యక్తి భాష, మాటతీరు, బాడీ లాంగ్వేజ్‌ను టార్గెట్ గా చేసుకుని ట్రోల్ చేయొచ్చని, కానీ సినిమా కోసం అతను పడే కష్టం, చూపించే డెడికేషన్ ను ఎవరూ తక్కువ చేయలేరని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విజయ్‌కు తన మద్దతు ప్రకటించారు హరీష్.
ట్రోలింగ్ కారణంగా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని చెబుతూ తన కెరీర్లో ఎదురైన పరిస్థితులను హరీష్ శంకర్ గుర్తుచేసుకున్నారు. తన మొదటి సినిమా షాక్ రిలీజైన తర్వాత ట్రోలింగ్‌కు భయపడి ఉంటే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడిని కాదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తానే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన డైరెక్టర్ని అని, అయినప్పటికీ వాటిని దాటుకుని నిలబడగలిగానని చెప్పారు. విజయ్ వ్యక్తిత్వం, అతని కష్టపడే తత్వంపై తనకు మంచి అభిప్రాయం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన నేనింతే సినిమాలోని ఓ డైలాగ్‌ను కూడా ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే, హరీష్ శంకర్ చివరిగా పవన్ కళ్యాణ్(pawan kalyan)తో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath singh) సినిమాను చేయగా, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఆయన దర్శకత్వం, కథాకథనాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కు ఆయన ఇచ్చిన మద్దతు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హరీష్ శంకర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.







