పురుగుల కోసం ప్రత్యేక హైవేలు.. ఎందుకు నిర్మిస్తున్నారు? వీటితో ఉపయోగం ఏమిటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మనుషుల కోసం హైవేలు నిర్మించడం చూశాం. నగరాలను కలిపే రహదారులు చూశాం. కానీ పురుగుల కోసం కూడా ప్రత్యేక హైవేలు నిర్మిస్తారని ఎప్పుడైనా ఊహించారా? బ్రిటన్లో ఇప్పుడు అదే జరుగుతోంది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కీటకాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు పూల మొక్కలు, గడ్డి భూములతో ప్రత్యేక మార్గాలను సిద్ధం చేస్తున్నారు. అయితే చిన్న పురుగుల కోసం ఇంత పెద్ద ప్రయత్నం ఎందుకు? వాటికి దారులు లేకపోతే మనుషులకు వచ్చే నష్టమేంటి?
అసలు సమస్య ఏమిటి
ఒకప్పుడు మన ఇళ్ల ముందు ఖాళీ స్థలాల్లో రకరకాల పూల మొక్కలు కనిపించేవి. పొలాల గట్లపై పిచ్చి మొక్కలు పెరిగేవి. వాటి చుట్టూ తేనెటీగలు, సీతాకోకచిలుకలు, చిన్న చిన్న పురుగులు తిరుగుతూ కనిపించేవి. ఇప్పుడు చాలా చోట్ల ఆ ఖాళీ స్థలాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు వచ్చాయి. పొలాల గట్ల రూపం మారుతోంది. మరి ఈ చిన్న జీవులకు ఆహారం దొరికేది ఎక్కడ? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది?
ఇదే ప్రశ్నకు పరిష్కారం వెతుకుతోంది బ్రిటన్. అక్కడ కీటకాల కోసం ప్రత్యేక హైవేలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇవి మనం చూసే తారు రోడ్లు కావు. పూల మొక్కలు, గడ్డి భూములతో సహజ ఆవాసాలను అనుసంధానించే పచ్చని మార్గాలు. చిన్న పురుగుల కోసం చేపడుతున్న ఈ ప్రయత్నం వెనుక పెద్ద పర్యావరణ సమస్య దాగి ఉంది.
మన ఊళ్లలోనూ కనిపిస్తున్న సమస్య ఇదేనా?
మన నగరాల్లో అపార్ట్మెంట్లు, రోడ్లు, ఇతర నిర్మాణాలు పెరుగుతున్నాయి. గ్రామాల్లోనూ భూమి వినియోగం మారుతోంది. ఈ మార్పులన్నీ ప్రతి ప్రాంతంలో కీటకాలు తగ్గడానికి చాలా వరకు కారణం అవుతున్నాయి. సహజ గడ్డి భూములు, పూల మొక్కలు, పొలాల గట్ల వంటి చిన్న ఆవాసాలు కనుమరుగైతే వాటిపై ఆధారపడే జీవులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఒక తేనెటీగకు పూలు అవసరం. ఒక సీతాకోకచిలుకకు ఆహార మొక్కలు, సంతానోత్పత్తికి అనువైన ప్రదేశాలు అవసరం. ఇలాంటి ప్రదేశాలు విడివిడిగా మారితే కొన్ని కీటకాలు వాటి మధ్య ప్రయాణించలేకపోవచ్చు.
పురుగులకు దారులే లేకుండా పోతున్నాయా?
ఒక ప్రాంతంలో పూల మొక్కలు, గడ్డి భూములు ఉన్నా.. వాటి చుట్టూ రహదారులు, వ్యవసాయ భూములు, నిర్మాణాలు విస్తరించి ఉంటే కొన్ని కీటకాలు మరో అనుకూల ప్రాంతానికి చేరుకోవడం కష్టమవుతుంది. పర్యావరణ శాస్త్రంలో దీనిని ఆవాసాల విభజన (Habitat Fragmentation) అంటారు.
ఈ సమస్యకు పరిష్కారంగా బ్రిటన్లోని బగ్లైఫ్ అనే ప్రకృతి పరిరక్షణ సంస్థ కీటకాలకు అనువైన ఆవాసాలను అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది.
పురుగులతో మనకేం పని?
కీటకాలు ప్రకృతిలో కీలక పాత్ర పోషిస్తాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి జీవులు అనేక మొక్కల పరాగసంపర్కానికి సహాయపడతాయి. కొన్ని కీటకాలు నేలలో పోషకాల చక్రానికి తోడ్పడతాయి. పక్షులు, ఇతర చిన్న జీవులకు కూడా ఇవి ఆహారంగా ఉపయోగపడతాయి.
అందుకే కీటకాల ఆవాసాలను కాపాడటం అంటే చిన్న జీవులను మాత్రమే రక్షించడం కాదు. వాటిపై ఆధారపడిన ప్రకృతి వ్యవస్థలను కూడా సంరక్షించడం కూడా అని మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఎంత ఏఐ వెనక పరుగెత్తినా ప్రకృతి అండలేకపోతే జీవించలేం.
బ్రిటన్ ఏం చేస్తోంది?
ఈ సమస్యకు పరిష్కారంగా …బగ్లైఫ్ అనే ప్రకృతి పరిరక్షణ సంస్థ కీటకాలకు అనువైన సహజ ఆవాసాలను అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. పూల మొక్కలు, స్థానిక గడ్డి జాతులతో కూడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి, కీటకాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లే అవకాశాలను పెంచడమే దీని లక్ష్యం.
బ్రిటన్లో మొత్తం 1.5 లక్షల హెక్టార్ల భూమిలో ఇలాంటి మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 5,300 హెక్టార్లకు పైగా భూమిలో ఆవాసాల అభివృద్ధి చేపట్టినట్లు పేర్కొన్నారు.
సర్రే ప్రాంతంలో సుమారు 60 హెక్టార్ల భూమిని కీటకాలకు అనువుగా మార్చే ప్రయత్నం కూడా జరిగింది. తోటలు, చర్చిల ప్రాంగణాలు, ఇతర పచ్చని ప్రాంతాలను ఈ కార్యక్రమంలో భాగం చేశారు.
ఉపగ్రహాలు, AIతో కీటకాలకు అనువైన ప్రాంతాల గుర్తింపు!
ఈ ప్రాజెక్టులో సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, మెషిన్ లెర్నింగ్ సాయంతో సహజ గడ్డి భూములను గుర్తించి, ఎక్కడ కొత్త ఆవాసాలను అభివృద్ధి చేయవచ్చో అంచనా వేస్తున్నారు.
ఈ విధానం ద్వారా పెద్ద భూభాగాలను వేగంగా పరిశీలించి, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాల్సిన ప్రాంతాలను గుర్తించవచ్చు. అయితే క్షేత్రస్థాయి పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కూడా అవసరమే.
మనం చేయగలిగేది ఏమిటి?
మన ఇంటి పెరట్లో, అపార్ట్మెంట్లో లేదా పాఠశాల ప్రాంగణంలో స్థానిక పూల మొక్కలకు కొంత స్థలం కేటాయించవచ్చు. అవసరం లేకుండా అన్ని గడ్డి ప్రాంతాలను తొలగించకుండా ఉండవచ్చు. కీటకాలకు అనుకూలమైన చిన్న పచ్చని ప్రదేశాలను కాపాడవచ్చు.
అయితే కొన్ని పూల మొక్కలు పెంచడమే మొత్తం సమస్యకు పరిష్కారం కాదు. పెద్ద స్థాయిలో సహజ ఆవాసాల పరిరక్షణ, వాటి అనుసంధానం, పురుగుమందుల బాధ్యతాయుత వినియోగం కూడా అవసరం.
ఫైనల్ గా ..
మనుషుల కోసం హైవేలు నగరాలను కలుపుతాయి. కీటకాల కోసం నిర్మిస్తున్న ఈ పచ్చని మార్గాలు ప్రకృతిలో విడిపోయిన జీవ ప్రపంచాలను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడటమంటే జీవులను మాత్రమే కాదు.. అవి బతకడానికి అవసరమైన దారులను కూడా కాపాడటమే! అంటే ఎటు తిరిగి మనని మనం కాపాడాకోవటమే.








