ఏపీ నిరుద్యోగులకు కొలువుల పండుగ..!
ఆంధ్రప్రదేశ్లో కొలువుల వేటలో ఉన్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ చెప్తోంది. ఇప్పటికే 2,721 పోస్టులతో మెగా డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా మరో 1,466 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 10 రకాల ప్రాథమిక నోటిఫికేషన్లను అధికారికంగా జారీ చేసింది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం అత్యంత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 892 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాగా, తాజా ప్రకటన నిరుద్యోగుల్లో సరికొత్త జోష్ నింపింది.
తాజా నోటిఫికేషన్లలో నిరుద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 సర్వీసుల కింద అత్యధికంగా 686 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ శశిధర్ మరియు సభ్యుడు సుధీర్లు వెల్లడించారు. ఈ గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన ఖాళీల సంఖ్య, రిజర్వేషన్లు, విద్యార్హతల పూర్తి వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను నవంబర్ 9న విడుదల చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 10 నుండి ప్రారంభమై, నవంబర్ 30 వరకు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుందని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ రిక్రూట్మెంట్లో డిప్యూటీ తాసిల్దార్, సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ అకౌంటెంట్ వంటి అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల సాధారణ వయోపరిమితి 18 నుండి 42 ఏళ్లుగా ఉండగా, వయోపరిమితిని నిర్ణయించేందుకు జులై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నారు.
పరీక్షా విధానం విషయానికొస్తే.. గ్రూప్-2 ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్లో రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. గ్రూప్-2తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇతర టీచింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.








