2029లో విజయం మాదే..! అప్పుడే తేల్చుకుందామన్న అమిత్ షా..!
హస్తినలో రోజుల తరబడి ఉధృతంగా విపక్ష ఇండీకూటమి ఆందోళనలు నిర్వహించడంపై.. అధికార ఎన్డీఏ మండిపడింది. తమ ఓటములకు వారు సాకులు వెతుకుతున్నారని ఆరోపించింది.ఓట్ల సవరణకు ఉద్దేశించిన ‘సర్’ లేనప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని… 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఆ పార్టీకి ఓటమేనని ఎద్దేవా చేశారు. ఆయన నాయకత్వ ఫలితాల్ని ‘సర్’పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలంతా భాజపా, ఎన్డీయే, ప్రధాని నరేంద్ర మోదీలతోనే ఉన్నారని షా ధీమా వ్యక్తంజేశారు.
సీఈసీ జ్ఞానేశ్కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తర్వాత తొలిసారి అమిత్ షా స్పందించారు. ‘‘ప్రజలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అనుసరిస్తూ వస్తున్న ప్రతికూల రాజకీయాలు ఆ పార్టీకి ప్రయోజనం కలిగించవు. అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పనితీరు పేలవంగా ఉంది. కాంగ్రెస్కు ముఖ్య నేతగా, కొన్నాళ్లు అధ్యక్షుడిగా, ప్రస్తుతం లోక్సభ విపక్ష నేతగా ఉన్న రాహుల్ హయాంలో వరసగా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం మూటగట్టుకుంటూ వస్తోంది. దానిపై మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అబద్ధాలు పదేపదే చెప్పి, మీడియా దృష్టిలో పడేందుకు కల్పిత ప్రయత్నాలు చేస్తుంటే మీరు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అయినా రాహుల్ను నేనొకటి సూటిగా అడగాలనుకుంటున్నాను. ఇదంతా ‘సర్’ ఫలితమేనా? 2024 తర్వాతేగా సర్ మొదలైంది? మరి అంతకుముందు కూడా మీ పార్టీ ఓడింది కదా? చొరబాటుదారుల్ని ఓటర్లుగా చేర్చాలనే రాహుల్ ఆలోచనల గురించి దేశ ప్రజలకు తెలుసు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఆధిక్యంతో ఎన్డీయే గెలవడం, వరసగా నాలుగోసారి కాంగ్రెస్ ఓటమిపాలు కావడం ఖాయమన్నారు.
దిల్లీలో 14 రాజకీయ పార్టీలకు చెందిన 8 వేల మంది కార్యకర్తలు ఒకటిన్నర కి.మీ. మేర గుమిగూడినంత మాత్రాన అది రాహుల్ మన దేశం తరఫున వినిపించిన వాణి అయిపోదని అమిత్ షా ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల మనోభావాలు తెలుసుకోవాలంటే పొలాలు, గ్రామాలు, కొండకోనలకు వెళ్లాలి. రాహుల్ అక్కడకు వెళ్లలేరు. బిహార్, యూపీ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారు. ఒకప్పటి కంచుకోటలాంటి గుజరాత్లో గత 41 ఏళ్లుగా ఒక్క ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోతోంది? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఇది’’ అని షా తెలిపారు.








