టార్గెట్ 100 గిగావాట్ పవర్.. 2047 నాటికి సాధించేలా కేంద్రం ప్లాన్…1
వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. 2047 బ్లూ ప్రింట్ రెడీ చేసిన కేంద్రం.. దానికి తగ్గట్లుగా చర్యలు చేపడుతోంది. అభివృద్ధికి విద్యుత్ ముఖ్యం.. అది కూడా భారీగా కావాలి. అందుకు తగినట్లుగా అణువిద్యుత్ పై కేంద్రం ఫోకస్ పెట్టింది.
2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచినట్లు అణుశక్తి కమిషన్ (AEC) చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రైవేట్ కంపెనీలు 7.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టి, 30 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్‌లో 9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా, ప్రభుత్వ సంస్థ NPCIL 24 రియాక్టర్లను నడుపుతోంది. మరో 17 రియాక్టర్ల నిర్మాణం జరుగుతోంది. అణురంగాన్ని వేగవంతం చేసేందుకు తెచ్చిన శాంతి చట్టంతో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి మార్గం సుగమమైందని ఐదేళ్లలో ప్రైవేట్ సంస్థలూ రియాక్టర్లను నిర్వహిస్తాయని AEC తెలిపింది. ఒక మెగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తికి 25 కోట్లు ఖర్చవుతుందని, ఉక్కు, సిమెంట్, భారీ పరిశ్రమల అవసరాలకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
“ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (NPCIL) ప్రస్తుతం 24 రియాక్టర్లను నిర్వహిస్తోంది. ప్రైవేట్ సంస్థలు కూడా అణు విద్యుత్ రంగంలోకి రావాలని భావిస్తున్నాం. అందుకే కొత్తగా శాంతి చట్టాన్ని తీసుకువచ్చాం. రాబోయే ఐదేళ్లలో ఒకటి రెండు ప్రైవేట్ రంగ సంస్థలు రియాక్టర్లను నిర్వహిస్తాయని ఆశిస్తున్నాను. 2047 నాటికి వారి నుంచి సుమారు 30 GW విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మేము అంచనా వేస్తున్నాం. 1 MW విద్యుత్ ఉత్పత్తికి సుమారు రూ. 25 కోట్ల ఖర్చు అవుతుంది” అని మొహంతి పేర్కొన్నారు.
దేశీయ వనరైన థోరియంను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా భారత్ మూడంచెల అణు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. మొదటి దశలో యురేనియం ఇంధనంగా వాడే రియాక్టర్లను ఉపయోగిస్తారు. ఇవి పనిచేస్తున్నప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, ప్లూటోనియం-239ను కూడా ఉత్పత్తి చేయగలవు. వాడిన అణు ఇంధనాన్ని పునఃప్రక్రియ చేయడం ద్వారా దీనిని తిరిగి పొందవచ్చని మొహంతి అన్నారు. ఇలా తిరిగి పొందిన ప్లూటోనియంను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీ ఆధారంగా రెండో దశలో ఉపయోగిస్తారు. ఈ దశ అదనపు విచ్ఛిన్న పదార్థాల ఉత్పత్తికి మద్దతు ఇవ్వడానికి, చివరికి థోరియం వినియోగాన్ని సులభతరం చేయడానికి రూపొందించిందని అన్నారు. “మూడో దశలో థోరియంను అణు ఇంధనంగా ఉపయోగపడే విచ్ఛిన్న పదార్థంగా మార్చాలని భావిస్తున్నారు. థోరియంను ముందుగా తగిన విచ్ఛిన్న పదార్థంగా మార్చకుండా నేరుగా సంప్రదాయ రియాక్టర్ ఇంధనంగా ఉపయోగించలేరు. ఈ సాంకేతిక సవాలును అధిగమించి, దేశీయ వనరులను మరింతగా ఉపయోగించుకునే అణు ఇంధన చక్రానికి అంతిమంగా మద్దతు ఇవ్వడానికే భారత్ మూడు- దశల కార్యక్రమాన్ని రూపొందించింది.” అని మొహంతి అన్నారు.
మోనజైట్ కలిగిన సముద్రతీర ఇసుకతో ముడిపడిన థోరియం వనరులు భారతదేశంలో గణనీయంగా ఉన్నాయి. “ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో సహా తీర రాష్ట్రాల్లో సముద్రతీర ఇసుక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటి నుంచి మోనజైట్‌ను వెలికితీయవచ్చు. వాటి నుంచి సరైన ప్రక్రియ ద్వారా థోరియంను తిరిగి పొందవచ్చు. ప్రపంచ థోరియం నిల్వల్లో 25 శాతం భారతదేశంలోనే ఉన్నాయి.” అని ఆయన తెలిపారు.
ఈ క్రమంలో తమిళనాడులోని కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా క్రిటికాలిటీని సాధించింది. ఇది అందుబాటులోకి వస్తే రష్యా తర్వాత వాణిజ్య ప్రాతిపదికన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను నిర్వహిస్తున్న రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.








