మక్కా డీల్ పై ఇరాన్ ఫైర్.. పాక్ కు డైరెక్టు వార్నింగ్…!
మక్కా రక్షణ ఒప్పందం అమల్లోకి రావడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యెమెన్ విషయంలో జోక్యం చేసుకుంటే గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా, అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ఈ కూటమిలో చేరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సౌదీ మౌలిక సదుపాయాలపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు పెరగడంతో, ఈ త్రైపాక్షిక ఒప్పందం అక్టోబర్ 5 నుంచి కార్యాచరణ దశలోకి ప్రవేశించింది. సౌదీ అరేబియాకు మద్దతుగా టర్కీ, పాకిస్థాన్ చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో, వేలాది మంది పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపవచ్చనే వార్తలపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందించారు. యెమెన్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా ప్రాంతంలో అవాంఛనీయ పరిణామాలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే, టర్కీ కంటే పాకిస్థాన్‌పైనే ఇరాన్ తన విమర్శలను ఎక్కువగా కేంద్రీకరించింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య మధ్యవర్తిగా ఇస్లామాబాద్ .. ఈ ఒప్పందంలోకి రావడం సరికాదన్నారు ఇరాన్ బఘాయి. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు అహ్మద్ నదేరి మాట్లాడుతూ, “యెమెన్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో సౌదీ పక్షాన పాకిస్థాన్ చేరడం.. ఆ దేశం ఇకపై మధ్యవర్తిగా కాకుండా, ప్రాంతీయ జోక్యదారుగా మారిందని చూపిస్తోంది” అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఇరాన్‌లోని పలువురు చట్టసభ సభ్యులు ఈ ఒప్పందాన్ని ఓ కాగితపు ఒప్పందంగా కొట్టిపారేశారు. పార్లమెంట్ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు ఇబ్రహీం రెజాయీ సౌదీని ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించారు. “ఏళ్ల తరబడి అమెరికాను ఏకపక్షంగా వాడుకున్నా రాని భద్రత, ఇప్పుడు టర్కీ, పాకిస్థాన్లతో చేసుకున్న కాగితపు ఒప్పందం వల్ల వస్తుందా? అనేది సౌదీలు తెలుసుకోవాలి. భద్రత కోసం ఇతరులను వేడుకోవాల్సిన దుస్థితి రాకుండా మీ విధానాలను సరిదిద్దుకోండి” అని ఆయన హితవు పలికారు.








