అప్పుల ఊబిలో అమెరికా.. పెరిగిన లోన్ డిఫాల్టర్స్..!
అగ్రరాజ్యం అమెరికా.. పేరుకే అగ్రరాజ్యమా అన్నట్లుంది అక్కడి పరిస్థితి. ముఖ్యంగా సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణం, అప్పుల భారం సామాన్యుల నడ్డి విరుస్తోంది. గత మూడేళ్లలో ప్రజల రుణ వాయిదాలు (Loan EMI) చెల్లించే సామర్థ్యం దారుణంగా పడిపోయిందని ఆ దేశ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సంచలన నివేదిక విడుదల చేసింది. 2022-2025 మధ్య కాలంలో అమెరికన్ కుటుంబాల ఆర్థికస్థితి గతులపై సర్వే నిర్వహించగా.. రుణాలు, రుణ వాయిదాలు చెల్లించలేక డి ఫాల్ట్ అవుతున్న కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది.
2022లో లోన్ రీ పేమెంట్లు చెల్లించని కుటుంబాలు 12% ఉండగా.. 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 20% చేరింది. 8 % పైగా కుటుంబాలు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఈఎంఐలు చెల్లించలేకపోయాయి. 2010 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికన్లు ఈ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోవడం ఇదే తొలిసారని ఈ సర్వే తేల్చి చెప్పింది.
అమెరికన్లు ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అమెరికాలో మొత్తం క్రెడిట్ కార్డ్ అప్పులు ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లు అంటే మర భారతీయ కరెన్సీలో123 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తాజా లెక్కల ప్రకారం తేలింది. ఈ భారీ మొత్తం వింటేనే సామాన్యుడికి గుండె ఆగినంత పని అవుతోంది. నిత్యావసరాల ధరలు పెరగడం, మితిమీరిన ఖర్చుల వల్ల బ్యాలెన్స్‌లు పేరుకుపోతున్నట్లు వెల్లడైంది.
అమెరికన్ల క్రెడిట్ కార్డ్ అప్పులపై వాలెట్ హబ్ నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రతి 5 మంది అమెరికన్లలో ఇద్దరు ఈ ఏడాది చివరి నాటికి తమ అప్పులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారని తేలింది. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. దాదాపు 42 శాతం మంది అమెరికన్లు తాము చనిపోయే వరకు ఈ అప్పుల నుంచి బయటపడలేమని, అప్పులతోనే జీవితం ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అప్పులు ఆర్థిక స్వేచ్ఛను హరిస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మెుదటగా విలాసాల కోసం చేసే అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని చెబుతున్నారు. బడ్జెట్ యాప్‌ల సాయంతో ప్రతి రూపాయి లెక్క చూసుకోవాలని వాలెట్ హబ్ ఎడిటర్ జాన్ కియెర్నాన్ సూచించారు. ముఖ్యంగా ఏఐ వంటి ఆన్లైన్ టూల్స్ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, క్రాస్ చెక్ చేసుకోవాలని హెచ్చరించారు. అప్పులను తీర్చే క్రమంలో.. ఏ కార్డుపై వడ్డీ రేటు ఎక్కువగా ఉందో దానిని ముందుగా క్లియర్ చేయడం వల్ల భారీగా డబ్బు ఆదా అవుతుందని సూచిస్తున్నారు. అలాగే అప్పులు అదుపులోకి వచ్చాక.. క్రెడిట్ కార్డులను ఒక ఉచ్చులా కాకుండా కేవలం అవసరానికి వాడే సాధనంగా మార్చుకోవాలని అమెరికన్లను హెచ్చరిస్తున్నారు.








