బుధిగండకి బీభత్సం.. నేపాల్ విలయ విషాదం…!
నేపాల్ పై ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది. ఈ హిమాలయదేశంపై వరదలు విరుచుకుపడుతున్నాయి. లేటెస్టుగా పశ్చిమ నేపాల్లోని గోర్ఖా ప్రాంతంలోని బుధిగండకి నది ఉగ్రరూపాన్ని దాల్చింది. వరదలు చుమానువిమి మున్సిపాలిటీని ముంచేశాయి. నీటి ప్రవాహంలో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
చుమ్నుబ్రి గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో బుధిగండకి నదికి అడ్డుకట్ట పడిందని.. దీంతో దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని అధికారులు తెలిపారు. త్రిశూలి దోభన్ వరకు నదీ సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దని.. ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) హెచ్చరికలు జారీ చేసింది. నదీతీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. లామ్జంగ్, డోల్పా, రుకుం తూర్పు, రుకుం పశ్చిమ, జజ్జర్కోట్, దార్చులా, బైతాది, డడేల్ధుర, డోటి, కైలాలి, కంచన్పుర్ జిల్లాలకు ముప్పుందని అధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున 4గంటల సమయంలో సియురిబాస్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో పలువురు గాయాలపాలయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పోలీసులతో పాటు, సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలు, సహాయ సామాగ్రి పంపిణీ కోసం హెలికాప్టర్లను మోహరించారు.
ఈ ఘటనపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా స్పందించారు. “బుధి గండకి నదిలో వరద పోటెత్తిన నేపథ్యంలో గాలింపు చర్యలు ప్రారంభించాం. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ల ద్వారా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న జగత్ ప్రాంతం నుంచి ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాఠ్మాండులో ఉన్న ‘కాంపోజిట్ క్విక్ రియాక్షన్ టీమ్’ను కూడా వాయు మార్గం ద్వారా ప్రభావిత ప్రాంతానికి తరలించారు” అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.








