పార్టీ నేతలకు రేటింగ్.. చంద్రబాబు కీలకప్రకటన..!
మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీఎం చంద్రబాబు(Chandrababu naidu) కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైసీపీ(YSRCP) చేసిన అన్యాయాన్ని వివరించిన సీఎం చంద్రబాబు.. జయహో బీసీ… జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని స్పష్టం చేసారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని… కలిసి ప్రచారం చేయాలంటూ సీఎం దిశా నిర్దేశం చేసారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోందనే విషయాన్ని గమనించాలన్న ముఖ్యమంత్రి.. డబులింజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలన్నారు.
2024 ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పడాలని.. ఇది నేతల పనితీరుకు కొలమానమని పేర్కొన్నారు. 50 రోజులు.. ఎవ్వరికీ మినహాయింపు లేదు.. గెలుపే ధ్యేయంగా పని చేయాలని స్పష్టం చేసారు. గెలుపు, నిజాయితీ, సమర్థత, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థుల ఎంపిక చేయాలని సూచించారు. సిన్సియార్టీ లేకుండా డ్రామాలాడేవారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు.. అలాంటి వారిని ఊపేక్షించమని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్ ఇస్తాం.
సరిగా పని చేయాలని అందరిని కోరుతున్నాను అని తెలిపారు. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు…కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకమన్నారు. న్యూట్రల్స్ సానుభూతి పరులుగా… ప్రత్యర్థులు న్యూట్రల్సుగా మారేలా పార్టీ కేడర్ పని చేయాలని సూచించారు. ఈ ఎన్నికలతో గొడ్డలి పార్టీకి, అభివృద్ది నిరోధకులకు, రౌడీలకు, రప్పా రప్పా టీంలకు గట్టి బుద్ది చెప్పాలని, 1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశాం. అంతే మొత్తంలో అభివృద్ది పనులు చేశామన్నారు.








