హీరో పైలట్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌరపురస్కారం..!
ఫ్లైదుబాయ్ ఘటనలో వీరోచిత పోరాటం చేసి, 174 మంది ప్రాణాలు కాపాడిన పైలట్ స్మిత్ మచ్చార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా 150 మంది ఇజ్రాయెలీల ప్రాణాలు కాపాడిన మచ్చార్ ను.. ఆదేశం నిజమైన హీరోలా భావిస్తోంది.భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించేందుకు జెరూసలేం రావాలంటూ ఆ దేశం ఆహ్వానించింది. ఆయనకు ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజంతో సత్కరించాలని టెలిఅవీవ్ నిర్ణయించింది.
పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ పురస్కారం స్వీకరించేందుకు జెరూసలేం రావాలంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ స్మిత్ మచ్చర్‌ను ఆహ్వానించారు. ఇజ్రాయెల్ పౌరులు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అరుదైన విషయంగా నిలవనుంది. మరోవైపు మచ్చర్ సాహసాన్ని ప్రశంసిస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ఆయన చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్‌లను ప్రధాన రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు.
మచ్చార్ మానవాళికి చెందిన వీరుడు
కెప్టెన్ మచ్చర్ కోలుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజల తరఫున ఆయనకు పౌర వీరత్వ పురస్కారాన్ని అందించడం తనకు గౌరవంగా ఉంటుందని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పేర్కొన్నారు. అక్టోబర్ 4న రాసిన లేఖలో మచ్చర్ చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, పట్టుదలకు కృతజ్ఞతలు తెలిపారు. విమానంలో జరిగిన పరిణామాలు థ్రిల్లర్ కథలా అనిపించినప్పటికీ, గాల్లో ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో కాక్‌పిట్‌లో నెలకొన్న భయానక పరిస్థితిని ఎవరైనా ఊహించగలరని పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పిని భరిస్తూ, ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవడం మచ్చర్ వ్యక్తిత్వ బలాన్ని, ఆయనలోని శౌర్యాన్ని ప్రతిబింబిస్తోందని హెర్జోగ్ ప్రశంసించారు. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత జెరూసలేంకు రావాలని ఆహ్వానించారు.
భారత సైనికుల వీరత్వాన్ని గుర్తుచేసిన హెర్జోగ్
భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని కూడా అధ్యక్షుడు హెర్జోగ్ తన లేఖలో ప్రస్తావించారు. 1918 సెప్టెంబర్ 23న ఒట్టోమన్ దళాల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని విముక్తి చేయడంలో భారత సైనికులు పోషించిన పాత్రను గుర్తుచేశారు. అప్పట్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పవిత్ర భూమిలోని నగరాల విముక్తికి కృషి చేసిన భారత సైనికుల సరసన మచ్చర్ కూడా నిలిచారని పేర్కొన్నారు. “మీరు ఇకపై మా ప్రజల చరిత్రలో అమూల్యమైన భాగంగా ఉంటారు. భారత గణతంత్రం, ఇజ్రాయెల్ దేశం మధ్య ఉన్న ఆత్మీయతను, అనుబంధాన్ని మరింత పెంపొందిస్తారు” అని హెర్జోగ్ తన లేఖలో రాశారు. మచ్చర్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ స్నేహితులు, భాగస్వాముల సంరక్షణలో ఉన్నారని పేర్కొంటూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలంతా ప్రార్థిస్తున్నారని తెలిపారు.
ఇజ్రాయెల్ అంతటా ప్రశంసలు
ఇదిలా ఉండగా మచ్చర్ ధైర్యసాహసాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, ప్రముఖ ప్రదేశాల్లో ఆయన చిత్రాలతో కూడిన పోస్టర్లు, భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. సుమారు 180 మంది ఇజ్రాయెలీల ప్రాణాలను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ ప్రజలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌లోని భారతీయ సమాజం నుంచి కూడా మచ్చర్‌కు మద్దతు లభిస్తోంది. ఘటన జరిగిన మరుసటి రోజు విశ్వవిద్యాలయాల్లోని క్యాంపస్ క్యాంటీన్లు భారతీయ విద్యార్థులకు రాయితీలు ఇచ్చాయని, వారితో ఆప్యాయంగా వ్యవహరించాయని విద్యార్థులు తెలిపారు.








