ఉక్రెయిన్ కు హ్యాండిచ్చిన అమెరికా.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..!
రష్యాతో నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు.. గట్టి షాక్ తగిలింది. యుద్ధంలో తోడుగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా.. ఒక్కసారిగా హ్యాండిచ్చింది. రష్యాతో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే.. ఉక్రెయిన్‌కు మరో షాకిచ్చారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ ఇక ఎంత మాత్రం పనికిరారని, కొత్త వ్యక్తిని ఆ పదవికి ఎన్నుకోవడం ఉత్తమమని ట్రంప్ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడం ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేయలేకపోయారని ఆక్షేపించారు. అంతటితో ట్రంప్ ఆగలేదు. అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సరైన కారణమే లేదన్నారు.
‘2022లో అమెరికా అధ్యక్షుడిగా నేను ఉన్నట్లయితే ఆ యుద్ధం ప్రారంభమయ్యేదే కాదు’ అని తెలిపారు ట్రంప్. ‘జెలెన్స్కీ వల్ల ఉక్రెయిన్ 30శాతం భూభాగాన్ని కోల్పోయింది. 20లక్షల మందికిపైగా ప్రజలు చనిపోయారు. మరో పది లక్షల మంది చెల్లాచెదురయ్యారు. కొత్త అధ్యక్షుడిని పొందటానికి ఉక్రెయిన్‌కు ఇదే సరైన తరుణం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి జెలెన్స్కీ కారణమంటూ ఆక్షేపించారు.
రష్యాతో డీల్‌పై ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ దేశంపై ఆంక్షలను ఎత్తివేస్తూ అమెరికా ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీ వరకూ ప్రపంచానికి డీజిల్‌ను సరఫరా చేయడానికి రష్యాకు మార్గం సుగమమైంది. రష్యా తొలుత 3 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేస్తుందని, నవంబరులో మరో 5 లక్షల టన్నులను అందిస్తుందని, ఆ తర్వాత వెంటనే 10 లక్షల టన్నులను సరఫరా చేస్తుందని, రిఫైనరీల సామర్థ్యాన్ని బట్టి రష్యా మొత్తంగా 30లక్షల టన్నుల డీజిల్‌ను పంపిణీ చేస్తుందని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్, పుతిన్‌ల ఒప్పందంపై జెలెన్స్కీ ఆగ్రహం
తమపై మరిన్ని బాంబులేయడానికి రష్యాకు అవకాశం కల్పించేలా పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డీజిల్ డీల్ కుదుర్చుకున్నారా అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రశ్నించారు. ‘డీజిల్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తివేసినందుకు కృతజ్ఞతగా శనివారం మా దేశంలోని జపోరిజియాలోని నివాస భవనాలపై రష్యా 5 గ్లైడ్ బాంబులు వేసింది. ఈ దాడుల్లో 15 మంది మరణించారు. కీవ్‌పైనా క్షిపణులతో రష్యా దాడులు చేసింది’’ అని జెలెన్స్కీ ఆక్షేపించారు.








