కేంద్రం – రాష్ట్రం మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ల చిచ్చు!
హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్ కారిడార్ల వ్యవహారం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడకు కారణమవుతోంది. ఒకవైపు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసి, భూసేకరణకు హడావుడి చేస్తుంటే.. మరోవైపు అలైన్మెంట్ ఇంకా ఖరారే కాలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు కేవలం సాంకేతిక లోపాలా లేక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యూహాలా అనే అనుమానాలకు తావిస్తున్నాయి.
తెలంగాణ మీదుగా ముంబై, బెంగళూరు, చెన్నైలకు హైస్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటు కోసం గతంలో రైల్వే అధికారులతో అనేక దఫాలు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన రైల్వే అధికారులు.. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని బహాదూర్గూడలో రైల్ హబ్ కోసం 400 ఎకరాలు కేటాయించడాన్ని ప్రాథమికంగా ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ సైతం దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
అంతర్గతంగా మార్గాలను నిర్ణయించుకున్న అధికారులు, హాలియా వంటి పలు ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో మార్కింగ్లు కూడా చేశారు. తెలంగాణ పరిధిలో ముంబై-పుణే కారిడార్ 93 కిలో మీటర్లు, హైదరాబాద్-బెంగళూరు 205 కిలోమీటర్లు, హైదరాబాద్-చెన్నై 180 కిలోమీటర్ల చొప్పున మార్గాలను ప్రతిపాదించారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పక్కనే వెళ్లేలా సవరణలు కూడా చేశారు. ఇదంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన ఈ ప్రణాళికలన్నింటినీ ఒక్కసారిగా గందరగోళంలోకి నెట్టింది.
కారిడార్ల అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదని, భూసేకరణ చేయడం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర మంత్రి స్పష్టం చేయడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, భూముల గుర్తింపు కోసం అధికారులను రంగంలోకి దించడం, దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు తలెత్తడం రాజకీయంగా అధికార పార్టీకి ఇరుకును తెస్తోంది. క్షేత్రస్థాయిలో మార్కింగ్లు వచ్చిన తర్వాత, అసలు అలైన్మెంట్ ఖరారే కాలేదనడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపాన్ని లేదా రాజకీయ లబ్ధి కోసమే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని ఎత్తిచూపుతోంది.
ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో తాము వేగంగా అడుగులు వేస్తుంటే, కేంద్రం మాత్రం నిబంధనల పేరుతో బ్రేకులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ముందుకు వెళ్తే సహించేది లేదనే సంకేతాలను కేంద్రం పంపుతోంది. మొత్తానికి, హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్మెంట్ తకరారు కేవలం సాంకేతిక సమస్య కాస్తా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాజకీయ రగడగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








