వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెల్లో కూటమి జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న జనసైనికులకు స్థానిక ఎన్నికల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ సమన్వయంతో ముందుకు సాగి, స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల అవినీతి, నిర్లక్ష్యపు పాలనపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల అత్యవసర రక్షణ, తాగునీరు, రోడ్ల వంటి ప్రాథమిక అవసరాలను విస్మరించిన గత పాలకులు, కేవలం తమ పార్టీ ప్రచారం కోసం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేశారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో పల్లెలు ప్రగతిని కోల్పోయి, తీవ్ర అన్యాయానికి గురయ్యాయని విమర్శించారు.
గత ప్రభుత్వ దుర్మార్గానికి చరమగీతం పాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి తెరలేపిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజకీయ కక్షసాధింపులకు తావులేకుండా, కేవలం గ్రామీణాభివృద్ధే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అందుకోసమే పల్లెలకు రాజకీయాలకు అతీతంగా భారీగా నిధులను కేటాయించామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి గ్రామానికి, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజన పల్లెలకు పక్కా రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని చెప్పుకొచ్చారు.








