ఇది ప్రభాస్ మంచితనం అనుకోవాలా?
ప్రభాస్ వంటి స్టార్ హీరోతో పని చేయటానికి ఎంతోమంది పెద్ద నిర్మాతలు క్యూలో నిలబడి ఉన్నారు. భవిష్యత్తులో ఉంటారు. అయితే ఆయన మాత్రం తనకంటూ కొన్ని లెక్కలు,ఆలోచనలతో ముందుకు వెళ్తూంటారు. ఆ లెక్కలు కమర్షియల్ గా ఉంటూ అభిమానులకు కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉండకపోవటమే సమస్యగా మారుతోంది. మంచితనం, తనవల్ల ఎవరూ నష్టపోకూడదు అనే ఆలోచనే ఆయన సినిమాల్లో ఎక్కువగా కనపడుతూంటుంది.
అఫ్ కోర్స్ ఆ లక్షణమే ఆయన్ని ఈ రోజున ప్యాన్ ఇండియా సినిమా స్టార్ ని చేసి నెంబర్ వన్ స్దాయిలో కూర్చుండబెట్టి ఉండచ్చు. అయితే ఆయన తీసుకునే నిర్ణయాలు ఒప్పుకునే సినిమాలు తరుచుగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్… పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో సినిమా కమిటయ్యాడనే వార్త బయిటకు రావటంతో హాట్ డిస్కషన్ గా మారింది.
ప్రభాస్ ఈ మధ్యనే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టాలీవుడ్ టాప్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వీరాభిమానులను సైతం ఈ సినిమా ఇంప్రెస్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రభాస్ అభిమానులకి నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. అయితే ప్రభాస్ మరోసారి ఇదే బ్యానర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రభాస్ ప్రామిస్ చేసారని నిర్మాత విశ్వప్రసాద్ అఫీషియల్ గా ప్రకటించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తాజా చిత్రం ‘గరివిడి లక్ష్మి’ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ ‘ది రాజాసాబ్’ ఫలితంపై టీజీ విశ్వ ప్రసాద్ స్పందించారు.
విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ది రాజాసాబ్’ను సరైన సీజన్లో విడుదల చేయలేదేమో. ఒకవేళ సంక్రాంతికి కాకుండా ఎప్పుడు వచ్చినా బాగా ఆడేది. సినిమాకున్న భారీదనాన్ని దృష్టిలో పెట్టుకుని మా వరకూ బాగానే విడుదల చేశాం. టికెట్ రేట్లు పెంచేందుకు ప్రయత్నించాం. దీంతో సినిమా ప్రీమియర్ ఆలస్యమైంది. అలా చేయకుండా ఉండ్సాలింది. చాలా మంది అసహనానికి గురయ్యారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మా సంస్థ నుంచి చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తాయి. అయితే, ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేయాలని నిర్ణయించుకున్నాం’’
‘‘ ‘స్పిరిట్’ మూవీ విషయంలో నా పాత్ర చాలా తక్కువ. నేను కేవలం డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే వ్యవహరిస్తున్నా. 2028లో ప్రభాస్తో ఓ మూవీ ఉంటుంది. అది కూడా భారీ స్థాయిలో తీస్తాం. కొన్ని సినిమాల విషయంలో తప్పులు జరిగాయి. భవిష్యత్లో తప్పులు జరగకుండా చూసుకుంటాం’’ అని టీజీ విశ్వప్రసాద్ అన్నారు.
ఇవి కూడా చదవండి
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం..సాధారణంగా ఓ బ్యానర్ లో సినిమా డిజాస్టర్ అయ్యినప్పుడు హీరోలు మెల్లిగా ఆ బ్యానర్ కు దూరం అవుతారు. అయితే ప్రభాస్…తన మంచితనంతో అలాంటి వాటికి దూరంగా ఉంటారు. బ్యానర్ రికవరీ అయ్యేందుకు తనదైన సాయం చేయాలనకుంటారు. ఆ క్రమంలోనే ఈ సినిమా కమిటయ్యారని, అంతేకానీ విశ్వప్రసాద్ అడ్వాన్స్ లు ఎప్పుడో ఇచ్చి లాక్ చేసిన బాపతు సినిమా కాదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి తన గొప్ప మనసును చాటుతున్నా అభిమానులను భయపెడుతోంది. మరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో..? ప్రభాస్ స్టార్డమ్కు తగ్గకుండా ఎలివేట్ చేసేలా ఈ కొత్త ప్రాజెక్టు ఉంటుందా అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని ఆయన పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చిలో విడుదల కానుంది.
మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కూడా ప్రభాస్ లైనప్లో ఉంది. ఈ చిత్రం 2027 దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ షూటింగ్లో ప్రభాస్ త్వరలో పాల్గొననున్నారు. ఈ సినిమా 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ PMFతో కలిసి పనిచేసే అవకాశం ఉందని సమాచారం.








