‘గరివిడి లక్ష్మి’ ప్రీమియర్స్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. పండగ సినిమా : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్
భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రీ-రిలీజ్ ప్రెస్మీట్లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి గరివిడి లక్ష్మి కొత్త రకమైన ప్రయత్నం. మా అమ్మాయి మొదట ప్రారంభించిన సినిమా ఇది. గత పది రోజులుగా ఈ సినిమాకు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా 17వ తేదీన ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ముందుగానే ప్రీమియర్స్ వేయాలని మొదటే నిర్ణయించుకున్నాం. దసరా పండక్కి ఈ సినిమా కచ్చితంగా నిలబడగలదని నమ్ముతున్నాం. 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా మీద నమ్మకంతోనే ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నాం. మేము చాలా మంచి సినిమాతో వస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మొదటి నుంచి ఈ సినిమాను చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాం. సినిమా లాంచింగ్ ఈవెంట్‌ను ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లాగా నిర్వహించాం. ఈ సినిమాలో సగం షూటింగ్ మా స్వస్థలం ఆదోనిలో చేశాం. మా సంస్థలో ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇలాంటి సినిమాలు కూడా చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రభాస్ గారితో కూడా ఒక సినిమా చేయబోతున్నాం. ‘గరివిడి లక్ష్మి’ సినిమాను ఇప్పటివరకు దాదాపు 15 సార్లు చూసి ఉంటాను. చూసిన ప్రతిసారీ అదే ఎమోషన్ క్రియేట్ చేసింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది.
హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చూసిన అందరి కళ్లల్లో నీళ్లు చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మేము అనుకున్నదాన్ని తెరపై చూపించగలిగామనిపించింది. ఆడియన్స్ కామెంట్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో తమ సొంతం చేసుకున్నారని అర్థమైంది. 17వ తేదీన అందరూ సినిమా చూసి, ఒక మంచి అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పాత్ర చేయడానికి నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ప్రేక్షకులే ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారనిపించింది. ఈ సినిమా పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. సినిమా చూసిన అందరూ తెర మీద పూర్తిగా గరివిడి లక్ష్మి పాత్రే కనిపించిందని చెప్పారు. ఒక నటిగా అది నాకు చాలా సంతృప్తినిచ్చింది.
రాగ్ మయూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి ప్రీమియర్స్ జరిగాయి. అక్కడ స్పందన చూస్తుంటే పట్టలేనంత ఆనందం కలిగింది. ఒక కంప్లీట్ సినిమా ఇచ్చామనే సంతృప్తి ఉంది. ఆడియన్స్ నుంచి నిన్న వచ్చిన స్పందనతో రాత్రి నిద్ర పట్టలేదు. 17న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. నిన్న సెలబ్రిటీ ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అది కొనసాగుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఇప్పటివరకు నా కెరీర్లోనే మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశాను. సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి, నటుడిగా ఇది నీకు పునర్జన్మ లాంటి క్యారెక్టర్ అని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాను పెద్ద మనసుతో ప్రోత్సహిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న ప్రీమియర్ షోలో సినిమా చూసిన అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాళ్ల స్పందన చూస్తుంటే మాకు చాలా ఆనందం కలిగింది. సినిమా అత్యంత గొప్ప అనుభూతిని కలిగించిందని, తమను ఎమోషనల్ చేసిందని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రేక్షకులందరూ మా సినిమాను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. గరివిడి లక్ష్మి పాత్ర గురించి అనుకున్నప్పుడే ఆనంది ఆ పాత్రకు సరిగ్గా న్యాయం చేస్తుందని నమ్మాను. నా నమ్మకాన్ని తను నిలబెట్టుకుంది. ఆ పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయింది.
మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. పాటను ప్రేమించిన ప్రతి కళాకారుడి హృదయంలో ఈ సినిమా నిలిచిపోతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విశ్వ ప్రసాద్ గారికి, కృతి గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్యూ. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. 17వ తేదీన ఈ సినిమా తప్పకుండా 100 శాతం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను.








