ఏపీ మున్సిపల్ పోరు: కాంగ్రెస్ అభ్యర్థుల వేట షురూ..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) కూడా ఎన్నికల రేసులో గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమైంది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వేదికగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు వీలుగా సీనియర్ నాయకులకు జిల్లాల వారీగా కీలకమైన ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.
ఈ కేటాయింపుల్లో భాగంగా సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డికి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఇవ్వగా.. మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజుకు అనకాపల్లి, విశాఖపట్నం, గిడుగు రుద్రరాజుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అలాగే జేడీ శీలం, మస్తాన్ వలి, చింతా మోహన్, హర్షకుమార్, తులసిరెడ్డి, కిల్లి కృపారాణి, కమలమ్మ, సుధాకర్, ఎలిజా వంటి హేమాహేమీలకు వివిధ జిల్లాల బాధ్యతలను కేటాయించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడమే లక్ష్యంగా ఇటీవల పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌కు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల బాధ్యతలు ఇవ్వగా, సూర్యనాయక్కు కడప, బాపట్ల జిల్లాలను కేటాయించారు.
జిల్లాల ఇన్‌ఛార్జ్‌లుగా నియమితులైన ఈ పీఏసీ సభ్యులకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జిల్లాల్లోని పార్టీ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి నాయకుల మధ్య పక్కా సమన్వయం కుదర్చాలని సూచించారు. గెలుపు గుర్రాలైన అభ్యర్థుల ఎంపికతో పాటు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే బలమైన నేతల చేరికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ స్థానిక పోరులో.. షర్మిల మార్క్ వ్యూహాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు మైలేజ్ తెచ్చిపెడతాయో చూడాలి.








