ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు .. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయడంతో పాటుగా వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ కాటా ఆమ్రపాలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ సౌరభ్ గౌర్‌కు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పోస్టింగ్ ఇచ్చారు. ఐఏఎస్ డి మురళీధర్ రెడ్డికి గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించారు. ఐఏఎస్ మంజులే బాలాజీ దిగంబర్‌కు ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఐఏఎస్ కె నీలకంఠారెడ్డికి యువజన సేవల డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఐఏఎస్ బి అనిల్ కుమార్ రెడ్డికి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ ఎన్ తేజ్ భరత్‌ను ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించారు. ఐఏఎస్ గెడెల శ్రీనుకుమార్‌కు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఐఏఎస్ ఎం వరప్రసాద్‌ను ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఐఏఎస్ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఐఏఎస్ రవి సుభాష్‌ను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. ఐఏఎస్ అధికారి శుభం బన్సాల్‌కు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ యువరాజ్‌ను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.








