పూర్వ విద్యార్థులం సంఘటితమై, శక్తియుక్తుల్ని ఏయూకి అందిద్దాం : కూచిభొట్ల ఆనంద్ పిలుపు
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా (ఏయూఏఏ-ఎన్ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్ల్యాండ్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. వేడుకలకు అమెరికాలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 12 గంటలకుపైగా సాగిన వేడుకలో విద్యాచర్చలు, పూర్వ విద్యార్థుల పరస్పర సమావేశాలు, ప్యానెల్ చర్చలు, విజయగాథలు, ప్రతిభావంతులకు సత్కారాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ కీ నోట్ అడ్రస్ ఇచ్చారు.
‘‘ఆంధ్ర విశ్వవిద్యాలయం అమ్మ ఒడిలో చదువుకున్న వారం, ఖండాంతరాలాల్లో, అమెరికా దేశంలో ఇలా కలుసుకోవడం అద్భుతమైన జ్ఞాపకం. జీవితం అనుభూతుల పుష్పగుచ్చం అని అంటారు. మన అనుభూతుల్లోకి ఈ పుష్పగుచ్చం కూడా వచ్చి చేరింది.
భారత దేశం నుంచి విచ్చేసిన వీసీ రాజశేఖర్ గారికి, ఆచార్య పాల్ డక్లస్ గారికి పూర్వ విద్యార్థుల పక్షాన స్వాగతం. ఆంధ్ర యూనివర్సిటీ అనే పేరు తలుచుకుంటేనే ఓ పులకరింత. అక్కడ జరిగిన విషయాలను తలుచుకుంటే.. అవతలి వారు ఆపు అనే వరకూ మాట్లాడే శక్తి ఇచ్చిన విద్యా భూమి ఆంధ్ర విశ్వవిద్యాలయం. నేను మచిలీపట్నంలో పుట్టి పెరిగి, అక్కడే చదివా. అప్పుడే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఓ లెటర్ వచ్చింది. ప్రవేశం వచ్చింది అన్నది దాని సారాంశం.ఎకనామిక్స్ లో వచ్చింది. అయితే.. మా గ్రామంలో అప్పట్లోనే రాపర్ల తేజస్వీ అనే వ్యక్తి ఎకనామిక్స్ చదివి, అప్పట్లోనే అమెరికాకి వచ్చేశారు. నేను కూడా ఎకనామిక్స్ చదివితే అమెరికా వెళ్లొచ్చు అని భావించా. అన్నీ వదిలేసి, ఎకనామిక్స్ లో చేరా.
ఆంధ్ర యూనివర్సిటీలో నడుచుకుంటూ వెళ్లితే.. చాలా గర్వంగా ఫీలయ్యాను.దీనికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి.. ఆర్ట్స్ కాలేజీలో వుండే ఉత్సాహం, ఉద్వేగం అనేవి ఇంజినీరింగ్ కాలేజీలో కనిపించవు. మా క్యాంపస్ నుంచి చూస్తే సముద్రం కనిపించేది. ఇంజినీరింగ్ వాళ్లకీ ఏమికనిపించవు. ఇంజినీరింగ్ వారందరూ మా క్యాంపస్ కి వచ్చేవారు. ఏ ఒక్క రోజు కూడా తరగతులు మిస్ అవ్వలేదు. ఉదయం 8:00 గంటలకు క్లాసులు ప్రారంభమయ్యేవి. మధ్యాహ్నం 1:00 గంటలకు ముగిసేవి. తరగతులు అవగానే నడుచుకుంటూ మా శాతవాహన హాస్టల్ కి వెళ్లేవాడ్ని. నా గది నెంబర్ 101.అందులో నలుగురం వుండేవారం. మా మెస్ లో ఆదివారం చేసే జాంగిరీ ఎప్పటికీ మరిచిపోలేం.ఆదివారం సుష్టుగా తిని, అందరమూ నడుచుకుంటూ రామకృష్ణ బీచ్ కి గానీ, జగదాంబ సెంటర్ కి గానీ వెళ్లేవారం. ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులూ 10 నెంబర్ బస్, మహారాణిపేటకి వెళ్లేవారం. దీనిని చూసే ఇంజినీరింగ్ వారికి బాధవేసేది. అలాగే రాత్రులు లా కాలేజీ దగ్గరికి వెళ్లి చదువుకునేవారం. మధ్యలో టీ కి వెళ్లేవారం. నాకు టీ, కాఫీ అలవాటు లేదు. అలాగే అక్కడే మిర్చి బజ్జీ కొట్టు వుండేది. అది చాలా పాపులర్. అలాగే మిర్చి బజ్జీ వేసే ఓనర్ కూతురు లక్ష్మీ కూడా అంతే పాపులర్.
వీటితో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు కూడా అసెంబ్లీ హాలులో వేసేవారం. అందులో మైమ్ నాటకం వేశాం. అప్పట్లో గోపాల్ రెడ్డి గారు రిజిస్ట్రార్. లైబర్రీకి వెళ్లి, మైక్రో, మ్యాక్రో ఎకనామిక్స్ కి సంబంధించిన పుస్తకాలు చదివాం. ఇందులో అప్పట్లో మాకు రత్నం గారు అని ప్రొఫెసర్ వుండేవారు. వారు చాలా గైడెన్స్ ఇచ్చారు. చివరికి స్పెషలైజేషన్ లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
విశ్వ విద్యాలయంలో ఎక్కడ నడిచినా.. ఓ అద్భుతమైన భావనే. ఈ విశ్వవిద్యాలయం నాది, ఇక్కడ చదువుకున్నాను అనే ఓ గర్వం వుండేది. గర్వం నుంచి వచ్చిన ఆత్మ విశ్వాసం వచ్చింది. అమెరికాకి వచ్చి, స్థిరపడ్డాను. నా తల్లి నాకు జన్మనిస్తే.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇలా తోడ్పాటునిచ్చింది.
అప్పట్లో ఆవుల సాంబశివరావు వీసీగా వుండేవారు. ఓ పద్ధతి వుండేది. అలాగే యూనివర్సిటీలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్స్ యూనియన్లు కూడా వుండేవి. కలిసి వుండేవారు. పోట్లాటలు వుండేవి కానీ, వేరు భావాలు వుండేవి కావు. అలా మా చదువులు సాగాయి. 30 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ కలుసుకున్నాం. ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమయం ఆసన్నమైంది. మనం కూడా ఏం చేయాలో ఆలోచించాలి.సాంకేతికత బాగా పెరిగింది. ఇక్కడి నుంచే మనం పాఠాలు చెప్పవచ్చు. 1250 ప్రొఫెసర్ పోస్టులు వుంటే 125,150 మంది మాత్రమే వున్నారట. తెలుగు శాఖలో అయితే ఒకేఒక అధ్యాపకులట. ఏడుగురు పార్ట్ టైమ్. వున్నారట.

అమెరికా వచ్చిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ మూలాలు మరిచిపోకుండా, ఇక్కడ కూడా భారతీయ కళలకు, భాషలకి,సాంకేతికత, భారతీయ సర్వస్వాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పాలని భావించి ‘‘ఆర్యా విశ్వ విద్యాలయం’’ ప్రారంభించాం. కృణ్వంతో విశ్వమార్యం’’ అనేది రుగ్వేద వాక్యం. దీని నుంచి తీసుకునే ప్రారంభించాం.కూచిపూడి, భరతనాట్యం. కర్నాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, సంస్కృతం, తెలుగులో మాస్టర్స్, పీహెచ్ డీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. చిట్టెన్ రాజు గారు మాస్టర్స్ చేసి, అద్భుతమైన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.
ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు మన శక్తి యుక్తుల్ని, మన శక్తిని అందివ్వాలి. అమెరికాలో కొన్ని వేల మంది ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వున్నారు.మనమంతా సంఘటిత శక్తిగా మారాలి. మన మేధస్సును యూనివర్సిటీకి ఎలా అందించాలి?ఎలా చేయాలి అని ఆలోచిద్దాం.మనం ఏదో సేవ చేస్తున్నాం అని భావించకుండా, మన బాధ్యతగా భావిద్దాం.మన ఆంధ్రా విశ్వవిద్యాలయం మరో శతాబ్దం ముందుకు వెళ్లేలా చేద్దాం. వేదికలపై చెప్పకుండా, చేసి చూపిద్దాం.అందరమూ కలుద్దాం.అందర్నీ ఒకచోట చేరుద్దాం. తేజస్వీ నావధీతమస్తు’’ అంటూ ముగించారు.
ఇక… ముఖ్య అతిథిగా హాజరైన ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల అనంతరం ఏయూ చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధన, నూతన ఆవిష్కరణ లు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా వర్సిటీ ముందుకు సాగుతోందన్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. బోధన, పరిశోధన రంగాల్లో సహకారం అందించాలని, అమెరికా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచాలని కోరారు. విద్యార్థులు, యువ అధ్యాపకులకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు వర్సిటీ విద్యాభివృద్ధి ప్రాధాన్యాలకు మద్దతుగా ఎండోమెంట్ నిధులను ఏర్పాటుచేయాలని సూచించారు.








