హరీశ్‌రావు మామకు సర్కార్ నోటీసులు.. హైకోర్టులో ఊరట!
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాల వేడి కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మామ మాధవరాపు హనుమంతరావుకు చెందిన 3.22 ఎకరాల భూమి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ భూమికి సంబంధించి మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ నోటీసును సవాల్ చేస్తూ హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని, లేదా 3.22 ఎకరాల భూమి నుండి తొలగించవద్దని కోర్టు స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, అసైన్డ్ భూముల బదలాయింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. వెలికట్ట గ్రామంలోని ఈ భూమి తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా బదలాయించారని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అందుకే ఈ భూమిని వెనక్కి తీసుకునేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అయితే.. బీఆర్ఎస్ మాత్రం దీనిని కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తోంది. తగిన అవకాశం ఇవ్వకుండా, ముందుగానే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నుతున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ కౌన్సిల్ జె. రామచందర్ రావు వాదించారు. ఈ భూమిని ఎప్పుడో మార్కెట్ ధర చెల్లించి చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, ఇతర కేసుల్లో ఇచ్చిన వెసులుబాటు ఆధారంగా తమకూ నోటీసును సస్పెండ్ చేయాలని కోరారు. మరోవైపు, పిటిషనర్ వివరణ సమర్పించే వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.
మొత్తానికి బీఆర్ఎస్ అగ్రనేతల భూఅక్రమాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా భూఅక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ అక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కోర్టుల ద్వారా రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ పోరు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.








