బాల్ ఠాక్రే పాత్రలో నేనే: విజయసాయి రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ సంచలనానికి తెరలేచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ విజయసాయి రెడ్డి(Vijayasai reddy) సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఈ దసరా పర్వదినాల్లోనే తన నూతన పార్టీకి సంబంధించిన పేరు, జెండా, ఎజెండా సిద్ధమవుతున్నాయని ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
తన తాజా సోషల్ మీడియా పోస్టులో విజయసాయి రెడ్డి రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీని శాసిస్తున్న రెండు ప్రధాన కుటుంబ పార్టీల ఆధిపత్యంపై తిరుగుబాటుగా ఈ కొత్త పార్టీని తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాను పార్టీ పెట్టకూడదని కోరుకునే కొందరు వ్యక్తులు చేస్తున్న చౌకబారు ప్రచారాలను, విమర్శలను అస్సలు పట్టించుకోనని.. వాటన్నింటికీ ఎలాంటి విలువ ఉండదని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి సరికొత్త యువ నాయకత్వాన్ని తయారు చేయడమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
ఈ కొత్త పార్టీ స్ట్రక్చర్‌కు సంబంధించి విజయసాయి రెడ్డి ఒక మైండ్ బ్లోయింగ్ ఈక్వేషన్‌ను తెరపైకి తెచ్చారు. మరోసారి చెపుతున్నా… మా పార్టీలో అధికారం జెన్-జీ ది.. నాది కేవలం బాల్ ఠాక్రే పాత్ర మాత్రమే అంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే శైలిని ఉదహరించారు. అంటే మహారాష్ట్రలో బాల్ ఠాక్రే ఎలాగైతే నేరుగా ఎలాంటి అధికారిక పదవులు తీసుకోకుండా వెనకుండి పార్టీని నడిపించారో.. తాను కూడా ఈ కొత్త పార్టీకి కేవలం ఒక మార్గదర్శిగా, మెంటార్‌గా మాత్రమే ఉంటానని, అసలైన పగ్గాలను యువతకే అప్పగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
అయితే, మున్సిపల్ ఎన్నికల వేళ విజయసాయి రెడ్డి ఆయుర్వేద వైద్యం కోసం కొద్దిరోజులు అందుబాటులో ఉండనని చెప్పినప్పటికీ, విజయదశమి నాటికి పార్టీ విధివిధానాలు ప్రకటిస్తాననడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీని వీడి సరికొత్త ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని సాయిరెడ్డి వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు అటు అధికార కూటమిలోనూ, ఇటు ప్రతిపక్ష వైసీపీ వర్గాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.








