అమరావతి బ్రాండ్ ఇమేజ్‌కు మైలేజ్..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని(Amaravati) అంతర్జాతీయ నాలెడ్జ్, డీప్-టెక్ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేసింది. ఏపీ ఐటీ మరియు టెక్నాలజీ రంగాన్ని మలుపు తిప్పే ప్రతిష్టాత్మక “అమరావతి క్వాంటం వ్యాలీ” ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలో నిర్మించ తలపెట్టిన క్వాంటం వ్యాలీ ఐకానిక్ ట్విన్ టవర్ల నిర్మాణ పనులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Narayana.p) శంకుస్థాపన చేశారు.
ఈ క్వాంటం వ్యాలీ టెక్ పార్కును సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు కరకట్ట రోడ్డు మధ్య భాగంలోని ఉద్ధండరాయునిపాలెం పరిసరాల్లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే 11 ఎకరాల స్థలంలో ఈ రెండు భారీ ట్విన్ టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 37.49 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ‘షెల్ అండ్ కోర్’ పద్ధతిలో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో టీ1, టీ2 టవర్లు రూపుదిద్దుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ సాగుతోంది. దక్షిణాసియాలోనే మొదటి ప్రత్యేక క్వాంటం వ్యాలీగా గుర్తింపు పొందుతున్న ఈ టెక్ పార్కులో.. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల భాగస్వామ్యంతో భారతదేశంలోనే అతిపెద్ద ‘156-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ సెంటర్’ ఏర్పాటు కానుంది. క్వాంటం టెక్నాలజీ ఆధారంగా డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ మరియు హెల్త్‌కేర్ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఈ ట్విన్ టవర్ల నిర్మాణం పూర్తి అయితే దేశ, విదేశాలకు చెందిన వందలాది డీప్-టెక్ స్టార్టప్‌లకు, పరిశోధనా సంస్థలకు అమరావతి వేదికగా మారనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికే క్వాంటం వ్యాలీ ప్రధాన మౌలిక వసతుల పనులను పూర్తి చేసి.. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ క్వాంటం కంప్యూటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన పూర్తి కావడంతో అమరావతి అభివృద్ధి నిర్మాణాల్లో కదలిక వచ్చిందని, ఇది రాబోయే రోజుల్లో ఏపీ ఐటీ రంగానికి భారీగా పెట్టుబడులను, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.








