ఫార్ములా ఈ-రేస్ కేసులో ట్విస్ట్.. కేటీఆర్ డిశ్చార్జి పిటిషన్..!
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఏసీబీ అధికారులు మోపిన అభియోగాలకు తగిన ప్రాథమిక ఆధారాలు లేవని ఆయన తన పిటిషన్లో వాదించారు. ఈ రేస్ నిర్వహణకు అక్రమంగా నిధులు బదిలీ చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 21 మందిని విచారించినప్పటికీ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో చార్జ్‌షీట్ నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కేటీఆర్ దాఖలు చేసిన ఈ డిశ్చార్జి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులపై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలు దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. ఫార్ములా ఈ- రేసు రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి తీసుకున్న విధానపరమైన నిర్ణయమని బీఆర్ఎస్ నాయకులు వాదిస్తున్నారు. దీనిని నేరంగా చిత్రీకరించి, నాయకులను ఇరుకున పెట్టాలని చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
మరోవైపు.. నిధుల మళ్లింపు, అనుమతుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారన్నది ఏసీబీ వాదనగా ఉంది. కోర్టు విచారణలో రాబోయే రోజుల్లో ఏసీబీ దాఖలు చేయబోయే కౌంటర్, న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ కేసు కేవలం న్యాయపరమైన పోరాటంగానే కాకుండా, రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత రాజకీయ ఘర్షణకు దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.








