లంచంగా రెండు ఆవులు, గేదె, కుక్క.. ! పోలీస్ అధికారి అవినీతి కేసులో బిగ్ ట్విస్ట్?
ఎక్కడైనా లంచం తీసుకోవడానికి సాధారణంగా డబ్బు అడుగుతారు. ఎందుకంటే అందులో ఒక సౌలభ్యం ఉంది. ఇచ్చేవాడు కవర్లో పెడతాడు. తీసుకునేవాడు జేబులో పెట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లు నటిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారిపై వచ్చిన ఆరోపణలు ఈ సంప్రదాయానికి కొత్త ఛాలెంజ్ విసిరాయి. అక్కడ అడిగిన లంచం.. రెండు ఆవులు, ఒక గేదె, ఒక జర్మన్ షెపర్డ్ కుక్క, అదనంగా రూ.35 వేల నగదు!
ఇది చదవగానే మీకు డౌట్ రావచ్చు… ఇది లంచం డిమాండా, లేక పాడి పరిశ్రమకు పెట్టుబడా, పెంపుడు జంతువుల సంరక్షణ పథకమా? అని. అయితే ప్రస్తుతానికి మనకు తెలిసింది ఒక్కటే. మద్యం అక్రమ రవాణా కేసులో ఓ వ్యక్తి పేరు తొలగించేందుకు ఈ డిమాండ్లు చేసినట్లు ఆరోపణలు. ఆరోపణలు నిజమైతే, అవినీతి నిరోధక శాఖ తన విచారణ పరిధిలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవాల్సి రావచ్చు. ఇన్నాళ్లూ లంచంగా తీసుకున్న డబ్బు ఎక్కడికి వెళ్లిందో పరిశీలించేవారు. ఇకపై ఆవులు ఎక్కడ మేత మేస్తున్నాయో కూడా తెలుసుకోవాల్సి వస్తుందనేది నిజం!
అసలేం జరిగింది. ఈ లంచం ప్యాకేజీలో ఏమిటి?
ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF)లోని ప్రయాగ్‌రాజ్ విభాగంలో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రణేంద్ర కుమార్ సింగ్‌పై ఈ వింత ఆరోపణలు వచ్చాయి. హరియాణాలోని హిసార్ జిల్లాకు చెందిన మన్వీర్ సింగ్ అలియాస్ మన్ను ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన మద్యం అక్రమ రవాణా కేసు నుంచి తన పేరు తొలగించేందుకు పోలీస్ అధికారి రెండు ఆవులు, ఒక గేదె, ఒక జర్మన్ షెపర్డ్ కుక్కతోపాటు రూ.35 వేలు డిమాండ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. మామూలుగా లంచం అనేది అడిగితే అది పెద్ద విషయం కాదు.. ఈ వ్యవస్దలో అది కామన్. ఇచ్చేవాడు. ఇస్తూంటాడు పుచ్చుకునేవాడు.. పుచ్చుకుంటాడు. పట్టుబడేవాడు పట్టుబడతాడు. ఇదంతా ఓ చక్రంలా జరుగుతూంటాయి. అయితే లంచం డబ్బు రూపంలో అడగకపోవటమే ఇక్కడ వింత అంతా.
అంటే ఇక్కడ లంచం ఇచ్చే వ్యక్తి దగ్గర కావాల్సిన డబ్బు లేదా. లేక ఆవులు, గేదెలు, కుక్కలు ఉన్నాయని తెలిసి ఏదో ఒకటిలే అని ఈ లంచం అడిగాడా.. ఇవన్నీ కాదు..ఈ పోలీస్ అధికారికి ఎప్పటినుంచో ఈ జంతువులు పెంచుకోవాలని మనస్సు ఉందా. వీటిల్లో ఒకటి మాత్రం నిజం.
ఇక 35 వేల మేటర్ దగ్గరకు వస్తే..దాన్ని ఫర్నిచర్ కోసం అడిగాడట. నిజంగానే ఫర్మిచర్ కోసం అడిగాడా లేక ఈ జంతువులను మేపేందుకు ఖర్చు కోసం అడిగాడా…ఇదీ తేలాలి.
ఇవి కూడా చదవండి
45 ఆడియోలు.. ఇప్పుడు అసలు పరీక్ష మొదలు
ఇక ఇక్కడ ఫిర్యాదు దారుడు మన్వీర్ సింగ్ చాలా తెలివైన వాడు. ఇవన్ని ఇచ్చినట్లే ఇచ్చి, ఈ విషయానికి సంభందించి సుమారు 45 ఆడియో రికార్డింగ్‌లు, సంభాషణలకు సంబంధించిన స్క్రీన్షాట్లను హరియాణా అవినీతి నిరోధక బ్యూరో (ACB)కు అందించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఫిబ్రవరి 17, 2026న ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఫిర్యాదుపై విచారణ, ఆధారాల పరిశీలన అనంతరం అక్టోబర్ 6న సబ్ ఇన్స్పెక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం.
అసలు ఎందుకీ లంచం
ఈ వివాదానికి మూలమైన మద్యం అక్రమ రవాణా కేసు 2023 సెప్టెంబర్ 2న ప్రయాగ్‌రాజ్‌లోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ కేసులో మన్వీర్ పేరు ఉంది. దాంతో ఆ కేసులోంచి అతని పేరు తీసేయాలంటే ఇవన్నీ లంచంగా ఇమ్మని పోలీసాయన పాపం అడిగాడు. దాంతో ఫిర్యాదుపై విచారణ అనంతరం 2026 అక్టోబర్ 6న హిసార్ అవినీతి నిరోధక బ్యూరో పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
లంచానికి కొత్త రేటు కార్డా?
ఈ కేసులోని ఆరోపణలు ఒక వ్యంగ్య ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. లంచం కూడా అవసరాన్ని బట్టి వస్తు మార్పిడి పద్ధతిలోకి మారితే, రేపు ఎవరు ఏం అడుగుతారు? నగదు బదులు బియ్యం బస్తాలా? ఫర్నిచర్ బదులు ఫ్రిజ్‌లా?
చివరకు.. లంచం నగదులోనే ఉండాలనే నియమం ఉందా?
లంచం డబ్బు రూపంలోనే తీసుకోవాలనే రూల్ లేకపోవటం దీనికంతటకీ కారణం కావచ్చు. అయితే ఈ రెండు ఆవులు, ఒక గేదె, ఒక జర్మన్ షెపర్డ్‌తో కూడిన ఈ ఆరోపణల జాబితా నిజమైతే, అవినీతికి సంబంధించిన లెక్కలు చూసే అధికారులకు కొత్త సమస్య వచ్చిపడినట్లే. నగదు లెక్కలు తేల్చడం ఒక ఎత్తు.. పశువుల లెక్కలు తేల్చడం మరో ఎత్తు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








